సాక్షి, తాడేపల్లి: ఇవాళ దేశ చరిత్రలో గొప్పరోజుగా మిగిలిపోతుందని.. దశాబ్దాల తర్వాత మహిళా రిజర్వేషన్ కల నెరవేరబోతుందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. శుక్రవారం ఆమె తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైఎస్సార్‌సీపీ ఇప్పటికే మద్దతు ప్రకటించిందన్నారు.
‘‘మహిళా రిజర్వేషన్ బిల్లుతో దేశ భవిష్యత్తు మారబోతుంది. మహిళా శక్తితో మన దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా చేద్దాం. మహిళల అభివృద్ధి గురించి ఆలోచించిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 90 శాతం పథకాలు మహిళల గౌరవం పెంచే పథకాలే. అమ్మ ఒడి దగ్గర నుంచి ప్రతి పథకం మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేదే.
..మహిళలకు వైఎస్ జగన్ ఎన్నో అవకాశాలు కల్పించారు. మహిళలను హోం మినిస్టర్లగా, డిప్యూటీ సీఎంలుగా చేసిన ఘనత జగనన్నదే. మహిళల పట్ల వైఎస్ జగన్ సామాజిక సంఘ సంస్కర్తగా ఆలోచన చేశారు. కూటమి పాలనలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగాయి. ఏపీలో లా అండ్ ఆర్డర్ పని చేయడం లేదు. చంద్రబాబు అజెండా రెడ్‌బుక్ పాలనే’’ అని విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళా సాధికారతకు అనేక కార్యక్రమాలు చేపట్టింది వైఎస్ జగనే. రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో చేయూత అందించారు. చంద్రబాబు వచ్చాక మహిళలకు రక్షణ లేదు. వేధింపులు, అఘాయిత్యాలు, ఆత్మహత్యలు పెరిగాయి. పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో పూర్తిగా దిగజారిందనేదానికి నిదర్శనం. మహిళల కోసమే జగన్ దిశ యాప్, మహిళా పోలీస్ స్టేషన్లు, జీరో ఎఫ్ఐఆర్ లు తెచ్చారు. కానీ చంద్రబాబు మహిళల కోసం ఏం చేశారు?. 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని మా హయాంలో ఆరోపణలు చేశారు. మరి నిజంగానే అదృశ్యమైతే వారిని చంద్రబాబు, పవన్ వెనక్కి తెచ్చారా?. మహిళల మీద లైంగికదాడి చేసిన కూటమి ఎమ్మెల్యేలు, నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అంటూ విడదల రజని నిలదీశారు.


