‘ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్‌సీపీదే అధికారం’ | YSRCP State Coordinator Sajjala In AP Govt | Sakshi
Sakshi News home page

‘ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్‌సీపీదే అధికారం’

Jun 23 2025 6:53 PM | Updated on Jun 23 2025 7:11 PM

YSRCP State Coordinator Sajjala In AP Govt

తాడేపల్లి:  కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు, కక్షసాధింపు చర్యలు, వేధింపులు, రెడ్‌బుక్‌ రాజ్యాంగం ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్సీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుందని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  ప్రస్తుతం ప్రజల్లో ఇదే చర్చ జరుగుతోందన్నారు సజ్జల. చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలం కావడమే కాదు.. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌  పూర్తిగా నాశనమయ్యేలే చేశారని సజ్జల విమర్శించారు. 

వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు  వెన్నపూస రవీంద్రా రెడ్డి  అధ్యక్షతన  జరిగిన 'పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సజ్జల మాట్లాడారు. 

‘వైఎస్సార్సీపీలో క్రియాశీలక విభాగంలో ఉన్న మీ అందరి పాత్ర చాలా కీలకమైంది, గతంలో మనకు అసెంబ్లీ ఎన్నికలకు మించి స్దానిక సంస్ధల ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు, అందరూ సమిష్టిగా పనిచేయడం వల్ల అరుదైన విజయం సాధించాం,  పంచాయతీరాజ్‌ విభాగంను బలోపేతం చేయాలని జగన్‌ గారు చెప్పారు, మీ విభాగం బలోపేతం అయినప్పుడే మనకు స్ధానిక సంస్ధల్లో బలంగా ఉండగలుగుతాం, ప్రజలకు, పార్టీకి ఉపయోగపడేలా మీ నాయకత్వం పటిష్టం కావాలి. ఇందులో భాగంగానే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాం. పంచాయతీరాజ్‌ చట్టాన్ని బలోపేతం చేసేందుకు మీరంతా చొరవ తీసుకోవాలి. రాష్ట్ర అభివృద్ది జరగాలంటే గ్రాస్‌ రూట్‌ లెవల్‌లో బలంగా ఉండాలి.

కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు, కక్షసాధింపు చర్యలు, వేధింపులు, రెడ్‌బుక్‌ రాజ్యాంగం ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్సీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుంది,   ప్రజల్లో, పార్టీ క్యాడర్‌ లో ఇదే చర్చ జరుగుతోంది. చంద్రబాబు సంక్షేమ పధకాలు అమలుచేయడం లేదు, లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా నాశనం అయింది, సామాన్యులు కూడా బలవుతున్నారు, గవర్నెన్స్‌ పూర్తిగా బ్రష్టుపట్టింది, మళ్ళీ గెలవలేమన్న భయంతో కూటమి నేతలు ఎవరి స్ధాయిలో వారు అడ్డంగా దోచుకుంటున్నారు, 

ఈ ఏడాదిలో 1.67 లక్షల కోట్ల అప్పులు చేసింది కూటమి ప్రభుత్వం, అమరావతిలో 40 వేల ఎకరాలు చాలవన్నట్లు మరో 40 వేల ఎకరాల భూములు లాక్కునే ప్రయత్నం జరుగుతోంది. మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ పేరుతో దోపిడీ నేరుగా పదిశాతం కమిషన్‌ తీసుకుంటున్నారు, వేలకోట్లు దోచుకోవడం లక్ష్యం, ప్రజల ఆకాంక్షలు, కోరికలతో సంబంధం లేకుండా పాలన సాగుతోంది, కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలుపై ప్రజలే నిలదీసేలా మన కార్యాచరణ ఉండాలి, అందుకు ప్రజలను అప్రమత్తం చేద్దాం.

ప్రజలను చైతన్యం చేయడానికి అవసరమైన కార్యక్రమాలు మనం నిరంతరం చేయాలి, క్షేత్రస్ధాయి వరకు మనం బలోపేతం కావాలి, అందుకే వివిధ విభాగాలతో సమావేశాలు జరుపుతున్నాం, కమిటీలు అన్నీ పూర్తి చేయాలి, మన కమిటీలు అన్నీ పూర్తయితే వైఎస్సార్‌సీపీ క్రియాశీలక సైన్యంగా 18 లక్షల మంది సిద్దమవుతారు. టెక్నాలజీని ఉపయోగించుకుని మన వాయిస్‌ బలంగా ప్రజల్లోకి తీసుకెళదాం. మన శక్తిసామర్ధ్యాలు జగన్‌ను మరోసారి సీఎంగా చేసుకునేందుకు, పార్టీని బలోపేతం చేసుకునేందుకు వినియోగిద్దాం’ అని సజ్జల సూచించారు. 

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం..
మన పంచాయతీ రాజ్‌ విభాగం అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.  ‘ఉపాధి హామీ నిధుల దోపిడీని అడ్డుకుందాం. కూటమి నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నారు, స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపును అడ్డుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు, వాటిని ధీటుగా ఎదుర్కొందాం. స్ధానిక సంస్ధల్లో మన ఉనికిని చాటి చెబుదాం. అనేక అంశాలపై మన విభాగంలో క్రియాశీలకంగా ఉన్నవారంతా ఎప్పటికప్పుడు స్పందించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం’ అని పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement