రాజధాని పేరుతో చంద్రబాబు అవినీతి యజ్ఞం
వైఎస్సార్‌సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి కోసం అసెంబ్లీలో తీర్మానం అన్నది చంద్రబాబు డ్రామా అని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇది ప్రజలను పూర్తిగా మభ్యపెట్టడానికి చేస్తున్న సరికొత్త ఎత్తుగడ అని ఆయన ధ్వజమెత్తారు. అమరావతి కోసం అసెంబ్లీలో చంద్రబాబు తీర్మానం పెట్టడంపై చంద్రబాబు సర్కార్‌కి సజ్జల రామకృష్ణారెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి కోసం తీర్మానం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో, ఎవరు అభ్యంతరం చెప్పారు, ఎవరెవరు అడ్డంకులు సృష్టించారో చంద్రబాబు స్పష్టంగా వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో తీర్మానం చేసి అంతా చేసేశానని చెప్పుకోవడమే లక్ష్యమని, అయితే శాసన మండలిని సమావేశపరచకుండా ఎందుకు ఉంచుతున్నారో కూడా సమాధానం చెప్పాలన్నారు. మండలిలో వైఎస్సార్‌సీపీ బలం ఎక్కువగా ఉందని... అమరావతిలో చంద్రబాబు అవినీతి, వ్యవహరిస్తున్న తీరును గట్టిగా ప్రశ్నిస్తారనే భయంతోనే మండలిని సమావేశపరచడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి శాశ్వత రాజధానిని నిర్మించి, ప్రజలకు వేగంగా అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన చంద్రబాబు ఎప్పుడూ చేయలేదని, రాజధాని అంశాన్ని శాశ్వత కామధేనువుగా మా ర్చుకుని అవినీతి యజ్ఞం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఇంకేమన్నారంటే..
జగన్ అమరావతికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు...
అమరావతి ప్రాంతానికి ఎప్పుడూ జగన్ వ్యతిరేకం కాదు. 2019లో అధికారంలోకి రాకముందే జగన్ ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. అవినీతి, దోపిడీ పైనే మా అభ్యంతరం. బాబు చెబుతున్నదానినిబట్టే రాజధానిలో కనీస మౌలిక సదుపాయాల కోసం రూ.2 లక్షల కోట్లు కావాలి. 2014–19 మధ్య ఐదేళ్లలో బాబు ఖర్చు చేసింది రూ.5వేల కోట్లే. ఇప్పుడు కూడా కొత్త నిర్మాణాలు ఏమీ చేపట్టలేదు. పాత బిల్డింగులే ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. వచ్చాక కూడా ఏమీ చేయడం లేదు. కొత్త నిర్మాణాలంటూ ఇప్పుడు చదరపు అడుగుకు రూ.19వేల వరకూ పెంచారు. మళ్లీ డిజైన్ల పేరిట రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 2018లో టెండర్లు ఖరారై, పనులు ప్రారంభమైన వాటికి కూడా మళ్లీ టెండర్లు పిలిచారు. అమరావతిని ఏటీఎం, కామధేనువుగా మార్చారు. రాజధాని రైతుల సమస్యలను ఇప్పటికీ పరిష్కరించ లేదు. పిల్లల పెళ్లిళ్లు కూడా రైతులు చేయలేకపోతున్నారు.
అమరావతి పనుల్లో పారదర్శకత ఏదీ?
అమరావతి పనులు ఎక్కడా జరగడం లేదు. ఆర్టీఐ కింద సమాచారం అడిగినా ఇవ్వడం లేదు. ఈ విడతలో రూ.9వేల కోట్లు తెచ్చి, రూ.5వేల కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే.. అమరావతికి వ్యతిరేకం అని ముద్ర వేస్తున్నారు. అమరావతి ఏపీలో భాగం కాదా? మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకే న్యాయం చేయకుండా, రెండో విడత పేరుతో మళ్లీ ఇబ్బందులు పెడుతున్నారు. అమరావతిలో పాత బిల్డింగులు తప్ప.. కొత్తగా చంద్రబాబు ఏం కట్టారు?. రాజధాని ప్రాంతానికి కనెక్టివిటీకోసం ఏమైనా చేశారా? ఇప్పటికీ కరకట్ట రోడ్డే కదా గతి.
వెస్ట్రన్ బైపాస్ పూర్తిచేసింది కూడా వైఎస్సార్‌సీపీ హయాంలోనే కదా? పనులు ఏమీ చేయకపోయినా, ప్రజలను నిరంతరం భ్రమల్లో పెట్టాలన్నదే చంద్రబాబు ప్లాన్. మొదటి రోజు నుంచి ఇప్పటి వరకూ అమరావతి విషయంలో వివరాలు ప్రభుత్వం బయట పెట్టగలదా? అమరావతి పేరు మీద అప్పులు తెస్తున్నారు, మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇస్తున్నారు, కమీషన్లు కొట్టేస్తున్నారు. రైతులకు ఇచ్చిన ప్లాట్లను మాత్రం అభివృద్ధి చేయడం లేదు. చంద్రబాబు గతంలో చెప్పిన హైపర్ లూప్ ఏమయ్యింది? అమరావతిలో ఒలింపిక్స్ ఏమయ్యాయి?
సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అట..
అమరావతి పనుల కమీషన్లకు సంబంధించే చంద్రబాబుకు ఇన్‌కంట్యాక్స్ నోటీసులు వచ్చాయి. రూ.2వేల కోట్ల అవినీతిపై ఆ రోజు ఇన్‌కంట్యాక్స్ నోటీసులు వచ్చాయి. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు కమీషన్లు, లంచాలు వెళ్లాయని ఆ నోటీసుల్లో ఉంది. ఈ నోటీసులపై విచారణ ఆగిపోయింది. అమరావతిలో చంద్రబాబు అవినీతికి ఈ నోటీసులే నిదర్శనం. సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అంటున్నారు. అదెలా చేస్తారో తెలియదు. లక్ష కోట్ల అప్పును ఎకరాల ధరతో విభజిస్తారట. మరి నిజంగా అక్కడ అంత ధర ఉందా? చంద్రబాబు అక్కడ భూమిని గజం రూ.7,500 చొప్పున తన కోడలి పేరుతో కొన్నాడు. ఆ ప్రకారం చూస్తే ఎకరం రూ.4 కోట్లు మాత్రమే అవుతుంది.
మరి 8 వేల ఎకరాలు, రూ.4 కోట్ల చొప్పున లెక్కిస్తే ఎంత అవుతుంది?. అందుకే మళ్లీ చెబుతున్నాం. మా పార్టీకి కానీ, మా నాయకుడికి కానీ ఒకటే స్థిరమైన అభిప్రాయం. మేము అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదు. రాజధాని నిర్మాణం పేరుతో చేస్తున్న దోపిడీని మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు అమరావతిలో సామాన్యులు, నిరుపేదలు ఉండే పరిస్థితి ఉందా? చివరకు అక్కడ పేదలకు ఇచ్చిన ప్లాట్లు కూడా రద్దు చేశారు కదా? అక్కడ ఆర్గానిక్‌గా ఎలా, ఎప్పుడు డెవలప్ అవుతుంది? అక్కడికి ప్రజలు ఎప్పుడొస్తారు? ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది?

నాడు ఇంటర్నేషనల్ సిటీ .. ఇప్పుడేమో మున్సిపాలిటీ అట!
ఆ రోజు అదే అమరావతిని ఇంటర్నేషనల్ సిటీ అన్నారు. అప్పుడు 33 వేల ఎకరాలు తీసుకున్నారు. మరి ఇప్పుడు మరో 30 వేల ఎకరాలు కావాలంటున్నాడు. ఆ తర్వాత ఇంకా కావాలంట. ఎందుకయ్యా అంటే, ఇప్పుడున్న భూమితో కేవలం మున్సిపాలిటీ మాత్రమే అవుతుంది అంటున్నారు. సింగపూర్ మాదిరిగా ఇంటర్నేషనల్ సిటీ కావాలంటే, మళ్లీ 30 వేలకు పైగా ఎకరాలు కావాలని చెబుతున్నాడు. దీంతో రైతులకు అనుమానం కలుగుతోంది. ఒకవేళ మీరు ఒకేసారి వేల ఎకరాలు అమ్మకానికి పెట్టినా, కొనడానికి ఎవరొస్తారు? అంత మొత్తం ఎవరు పెట్టుబడి పెడతారు? ఇంకా, మీరు అనుకున్న ధర వస్తుందా? ఈలోగా వడ్డీలు ఎంత పెరుగుతాయి? రుణాలు తిరిగి ఎలా చెల్లిస్తారు?. ఇవన్నీ గట్టిగా నిలదీస్తాం కాబట్టే, అమరావతిపై తీర్మానం కోసం మండలిని సమావేశపర్చడం లేదు.


