తాడేపల్లి : ఇచ్చిన హామీలను మాటలతోనే సరిపెట్టకుండా చేతల్లో చూపిన నాయకుడు వైఎస్ జగన్ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ బీసీలకు వైఎస్ జగన్ అండగా నిలిచారని సజ్జల తెలిపారు. ఈరోజు(గురువారం, ఏప్రిల్ 16వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో బీసీ నేతల సమావేశం జరిగింది. బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.

దీనికి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీ మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బీసీ విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్లు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర బీసీ సాధికార విభాగ అధ్యక్షులు హాజరయ్యారు.

ఈ మేరకు సజ్జల మాట్లాడుతూ.. ‘బీసీల సాధికారతకు జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇచ్చిన హామీలను మాటల్లో కాదు, చేతల్లో చూపిన నాయకుడు జగన్. అన్ని రంగాల్లోనూ జగన్ బీసీలకు అండగా నిలిచారు. చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలు నష్టపోయారు. ఏ సంక్షేమ పథకమూ అందటం లేదు.కూటమి ప్రభుత్వంలో వ్యవస్థీకృత అవినీతి, రాజకీయ జోక్యం పెరిగింది. అమరావతి పేరుతో భారీ దోపిడీ జరుగుతోంది. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు. ఇష్టానుసారం అక్రమ కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుంది..’అని స్పష్టం చేశారు.


ఈ నెల 26న బీసీ గళం సమావేశం
ఈ నెల 26న అనంతపురంలో బీసీ గళం సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు సజ్జల. దీనిలో భాగంగా ఆ సమావేశం పోస్టర్‌ను విడుదల చేశారు.


