
వేంసూరు: రైతులు 59 ఏళ్లలోపు చనిపో తేనే రైతు బీమా వర్తిస్తుందని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వందుర్మార్గంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంలో సోమవారం రైతుగోస దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో షర్మిల మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌కు 69 ఏళ్లు.
సీఎంగా పాలిస్తున్నారు. రైతులకు మాత్రం 60 ఏళ్లు దాటితే రైతుబీమా వర్తించదని చెప్పడం ఏంటి? రైతుబంధు సాయం విత్తనాలకు కాదు కదా.. కూలీల ఖర్చుకు కూడా సరిపోవడం లేదు. ఎకరానికి రూ.5 వేలిస్తూ రూ.25 వేల సబ్సిడీలను తొలగించారు. పంట నష్టపోతే పరిహారం అందడం లేదు. రైతు రుణమాఫీ, పోడు భూములకు పట్టాలు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇలా అన్ని హామీలను కేసీఆర్ అటకెక్కించారు.
కాంగ్రెస్ వాళ్లకు ఓటు వేస్తే అమ్ముడుపోతారు. బీజేపీకి ఓటు వేస్తే మతతత్వ రాజకీయాలు చేస్తారు. వైఎస్సార్ సంక్షేమ పాలన మళ్లీ రావాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌టీపీని దీవించాలి. అధికారంలోకి రాగానే సాగు పథకాలు, ఉద్యోగాల భర్తీ ఫైల్‌పైనే మొదటి సంతకం చేస్తా’అని షర్మిల ప్రకటించారు.