ఆ లేఖ ఎలా ఇచ్చావ్‌ కేసీఆర్‌: రేవంత్‌ 

Revanth Reddy Fires On Kcr About Boiled Rice Letter To Central Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇకపై తెలంగాణ నుంచి బాయిల్డ్‌ రైస్‌ కొనాలని కోరబోమంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఇచ్చే అధికారం సీఎం కేసీఆర్‌కు ఎవరిచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రైతాంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ఈ ఘోరమైన నిర్ణయాన్ని ఏకపక్షంగా ఎలా తీసుకున్నారని, కనీసం రైతు నాయకులు, సంఘాలతో చర్చించకుండా కేంద్రానికి లేఖ ఇవ్వడానికి కారణమేంటని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో నిలదీశారు. కేసీఆర్‌ కేసుల విషయంలో మోదీ సహకారం అవసరమని, దానికి ప్రతిఫలంగానే రైతుల ప్రయోజనాలకు ఉరివేసే లేఖను ఇచ్చావా అని కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నిస్తోందని తెలిపారు.

కేంద్రం ముందు మోకరిల్లి లేఖ ఇచ్చి వచ్చిన కేసీఆర్‌ ఇప్పుడు పోరాటం చేస్తానంటూ బీరాలు పలకడం తెలంగాణ రైతులను మోసం చేయడమేనని, దీన్ని తెలంగాణ రైతులు నమ్మరని వెల్లడించారు. కేంద్రం తెచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలపై ఏడాది కాలంగా రైతులు కొట్లాడుతుంటే మోదీ ములాఖత్‌లకు, పార్టీ ఆఫీసు శంకుస్థాపనలకు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌కు ఒక్కసారయినా పోరాడుతున్న రైతాంగాన్ని పరామర్శించాలన్న జ్ఞానం కలగలేదని ఎద్దేవా చేశారు. చలిలో వణుకుతూ, ఎండలో ఎండుతూ రైతులు ప్రాణాలు కోల్పోయినా ఇదేంటని కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం లేని కేసీఆర్‌ పదే పదే ఢిల్లీపై యుద్ధం చేస్తానని తెలంగాణ సమాజాన్ని ఇంకెన్ని రోజులు మోసం చేస్తావని, ఇంకెన్నాళ్లు వాళ్ల చెవుల్లో పువ్వులు పెడతావని ప్రశ్నించారు.

ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలిసే తెలంగాణ రైతులకు ఉరి తాళ్లు పేనుతున్నారన్న విషయం అర్థమవుతోందని రేవంత్‌ అభిప్రాయపడ్డారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం తానేమీ చేయలేన ని, కేంద్రం కొంటే దళారి పాత్రను పోషిస్తాను తప్ప కేంద్రంతో కొనిచ్చే బాధ్యత తనది కాదని ప్రగతిభవన్‌ ప్రెస్‌మీట్‌లో కేసీఆర్‌ తేల్చిచెప్పేశారని, ఢిల్లీ కొననంటే తననేం చేయమంటారని చావు కబురు చల్లగా చెప్పిన కేసీఆర్‌ డూడూ బసవన్న లాగా బాయిల్డ్‌ రైస్‌ కొనకుండా కేంద్రానికి అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నిం చారు. సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ అంటే తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు, రైతుల మరణాలు, టోకెన్ల పేరుతో రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తారని, ధాన్యం సేకరణపై స్పష్టమైన విధివిధానాలు ప్రకటిస్తారని ఆశిస్తే ఢిల్లీపై పోరాటమంటూ పాతపాటే పాడారన్నారు.  

పెంచలేదనడం పచ్చి అబద్ధం 
పెట్రోలియం ఉత్పత్తులపై రాష్ట్రం ఒక్క రూపాయి పన్ను పెంచలేదని సీఎం కేసీఆర్‌ చెప్పడం పచ్చి అబద్ధమని రేవంత్‌ తప్పుపట్టారు. పెట్రో ఉత్పత్తులపై రెండు సార్లు రెండు రూపాయల చొప్పున మొత్తం రూ. 4 పన్ను పెంచారని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పంజాబ్‌లో పెట్రో ఉత్పత్తులపై పన్ను రూ.10 తగ్గించారని, మరి కేసీఆర్‌ సంగతేంటో  చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top