Telangana Politics: ఆ ఉమ్మడి జిల్లాలో ఎవరి బలం ఎంత?

ఉమ్మడి రంగారెడ్డిలోని ఐదు కీలక నియోజకవర్గాలతో మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లా ఏర్పడింది. వీటిలో చాలావరకు అర్బన్‌ప్రాంతాలే ఉన్నాయి. ఈ జిల్లాలోని నియోజకవర్గాల నుంచి అప్పుడు.. ఇప్పుడూ ఎందరో కీలక నేతలు ఎదిగారు. ఇప్పుడిక మూడు పార్టీలు నువ్వా నేనా అంటున్నాయి. ఇంతకీ ఎవరి బలం ఎంత?
గత ఎన్నికల్లో మేడ్చల్‌నుంచి విజయం సాధించిన టీఆర్ఎస్‌అభ్యర్థి మల్లారెడ్డి కేసీఆర్ క్యాబినేట్ లో చోటు దక్కించుకున్నారు. 2014లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన మలిపెద్ది సుధీర్ రెడ్డికి 2018లో టికెట్ దక్కకపోయినా తనయుడు హరిశ్చంద్ర రెడ్డికి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని సాధించుకున్నారు. ఇదిలా ఉంటే మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి వర్గీయుల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో కూడా ఆర్ధిక, అంగ బలాలున్న తనకే టికెట్ దక్కుతుందని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి విధేయుడిగా ఉన్న తనకు టికెట్ ఖాయమని సుదీర్ రెడ్డి అంటున్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీ చేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ప్రస్తుతం సైలెంట్ మోడ్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి KLR రాజీనామా లేఖ ఇచ్చారు కానీ ఆమోదించలేదు. పార్టీలో ఉన్నారో లేరో తెలియని పరిస్థితి. ఇక సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఈ సారి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ సరైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న విక్రమ్ రెడ్డి, సీనియర్ నేత మోహన్ రెడ్డి పార్టీ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బలమైన నేతను పార్టీలో చెర్చుకుని ఎలాగైనా విజయం సాధించాలని కమలనాథులు భావిస్తున్నారు.
2009లో ఏర్పడిన మల్కాజ్‌గిరి నుంచి గత రెండుసార్లుగా గులాబీ పార్టీ విజయం సాధిస్తోంది. సిటింగ్‌ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు రోహిత్‌ను బరిలో దింపాలని భావిస్తున్నారు. GHMC ఎన్నికల్లో నియోజకవర్గంలోని 7 డివిజన్లలో నాలుగు టిఆర్ఎస్ గెలిచింది. మరో 3 బీజేపీ కైవసం చేసుకుంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై ఘాటు వ్యాఖ్యలు చేసిన మైనంపల్లిని ఓడించాలని గట్టిపట్టుదలతో ఉన్నారు బీజేపీ నేతలు. 2014 నుంచి జరుగుతున్న ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ తరపున రామచంద్రరావు పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా ఆయనకే అవకాశం ఇస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్ ఇక్కడ నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి పీసీసీ చీఫ్ రేవంత్ అనుచరుడిగా ఉన్న నందికంటి శ్రీధర్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు.
ఉప్పల్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్య పోరాటం తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఎవరికి వారుగా పోటా పోటీ పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. నియోజకవర్గంపై పట్టు నిలుపుకునేందుకు పోటీ పడుతున్నారు. బండారి లక్ష్మారెడ్డి టిఆర్ఎస్ టికెట్ దక్కుతుందనే ఆశతో గత ఎన్నికల సమయంలో హస్తానికి హ్యాండిచ్చి గులాబీ కండువా కప్పుకున్నారు. అప్పట్లో నిరాశే ఎదురుకావడంతో వచ్చే ఎన్నికల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉప్పల్ లో బీజేపీ ఎవరికి అవకాశం కల్పిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. 2018 ఎన్నికల్లో ఓడిన NVSS ప్రభాకర్‌పై ఆశలు సన్నగిల్లాయి. గత ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన వీరేందర్ గౌడ్ కు అవకాశం ఇస్తారా? అనేది ఇంకా తేలలేదు. ఇద్దరు నేతలు ఎవరికి వారు పని చేసుకుంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ ఎంపీ గా ఉన్న మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఉప్పల్ అసెంబ్లీ స్థానంపై కాంగ్రెస్ టిక్కెట్‌కోసం రాగిడి లక్ష్మారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి ఆశలు పెంచుకున్నారు. అయితే గత ఎన్నికల్లో పొత్తులో టీడీపీ కి ఉప్పల్‌సీటు వదిలేయడంతో క్యాడర్ చిన్నాభిన్నం అయ్యింది.
పూర్తిగా పారిశ్రామిక ప్రాంతం అయిన కుత్బుల్లాపూర్‌లో పారిశ్రామిక కార్మికులు ఎక్కువగా ఉంటారు. ఈ సెగ్మెంట్‌పరిధిలో 8 జీహెచ్ఎంసీ డివిజన్లు, నిజాంపేట కార్పోరేషన్, కొంపల్లి, దుండిగల్ మున్సిపాల్టీలు ఉన్నాయి. గత రెండు ఎన్నికల్లో వివేకానంద గౌడ్‌కుత్బుల్లాపూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండుసార్లు వివేక్ చేతిలో ఓటమి చెందిన కూన శ్రీశైలం గౌడ్ ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయడానికి శ్రీశైలం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.
టీఆర్ఎస్ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వివేక్‌కు మళ్ళీ అవకాశం ఇస్తుందా ? లేక కేసీఆర్ సొంత మనిషిగా ఉన్న ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును కుత్బుల్లాపూర్ నుంచి బరిలో దించుతారనే ప్రచారం సాగుతోంది. దీంతో కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య బయటపడేంత వర్గబేధాలు లేనప్పటికీ... ఎవరికి వారు అప్రమత్తంగా క్యాడర్‌ను మెయింటైన్ చేస్తున్నారు. శంబీపూర్ రాజు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత తీవ్రంగా ఉంటే.. రాజును ఎన్నికల బరిలో దింపాలని టీఆర్ఎస్ భావిస్తోంది.
కాంగ్రెస్ నేత శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ బలమైన నేత కోసం అన్వేషిస్తోంది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కొలను హన్మంత్‌రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ టికెట్ దక్కించుకుని గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. హన్మంతరెడ్డికి పోటీగా శ్రీపతి రెడ్డి, జ్యోత్స్నా శివారెడ్డి పనిచేస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లో గ్రూపులు తనకు కలిసొస్తాయని బీజేపీ నాయకుడు కూన శ్రీశైలంగౌడ్ భావిస్తున్నారు. ఎవరికి వారు ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల పనులు మొదలు పెట్టేశారు. కానీ.. చివరికి టికెట్ ఎవరికి దక్కుతుంది ? బరిలో నిలిచేదెవరు? పోరాడి గెలిచేదెవరో చూడాలి.
కూకట్ పల్లి ప్రజలు 2009లో లోక్ సత్తా పార్టీ జయప్రకాశ్ నారాయణ్‌కు పట్టం కట్టారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన మాధవరం కృష్ణారావు... ఆ తర్వాత టిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. 2018లో టిఆర్ఎస్ తరపున రెండో సారి విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. 2018లో ఈ సీటును టీడీపీకి కేటాయించడంతో అప్పటి నుంచి కాంగ్రెస్‌కేడర్‌చిన్నాభిన్నం అయిపోయింది. ఇక బిజేపీ నియోజకవర్గంలో పట్టు బిగించడానికి కష్టపడుతోంది. గత ఎన్నికల్లో బీఎస్పీ తరుపున పోటీ చేసిన పన్నాల హరీష్ రెడ్డి బీజేపీలో చేరారు. ఎలాగైనా కాషాయపార్టీ తరపున గెలవాలని పట్టుదలతో ఉన్నారు హరీష్ రెడ్డి. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో కూకట్ పల్లి ప్రజలు సిట్టింగ్ ఎమ్మెల్యేకి హ్యాట్రిక్ అవకాశం ఇస్తారా ? కొత్త నేతకు ఛాన్స్ ఇస్తారా ? చూడాలి.