Peddireddy Ramachandra Reddy Fires On Eenadu Ramojirao - Sakshi
Sakshi News home page

రామోజీది దిగజారుడుతనం 

Oct 26 2022 3:07 AM | Updated on Oct 26 2022 11:46 AM

Peddireddy Ramachandra Reddy Fires On Eenadu Ramojirao - Sakshi

సాక్షి ప్రతినిధి, తిరుపతి: రామోజీరావు అసత్య కథనాలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఈనాడు పత్రికలో సోమవారం ‘రైతు చేనుకు.. కడప మీటరు’ శీర్షికతో మరోసారి స్మార్ట్‌ మీటర్లపై వక్రీకరణ కథనాన్ని వండివార్చారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. తిరుపతిలోని క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఒక్కో స్మార్ట్‌ మీటర్‌కు రూ.35 వేల వంతున రాష్ట్రంలోని మూడు డిస్కంల పరిధిలో 18.61 లక్షల స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకు రూ.6,173 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని, ఇదో భారీ స్కామ్‌ అంటూ గతంలో రద్దుచేసిన టెండర్లపై ఈనాడు తప్పుడు రాతలు రాసిందని మండిపడ్డారు. కోవిడ్‌ సమయంలో రూపొందించిన ఈ టెండర్‌ అంచనాలను సమీక్షించుకుని, వాటిలో హెచ్చుతగ్గులున్నాయని గ్రహించి గతంలోనే వాటిని రద్దుచేశామని స్పష్టం చేశారు.

ఈ విషయం ఈనాడు రామోజీరావుకు కూడా తెలుసని, అయినా రైతుల్లో గందరగోళం సృష్టించాలనే ఇటువంటి కథనాలు రాస్తున్నారని చెప్పారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావాలనే తపనలో భాగంగా రోజుకో అబద్ధాన్ని స్టోరీగా రాస్తున్నారని, అందులో భాగంగానే ఈ కథనం కూడా రాశారని ధ్వజమెత్తారు.  

మీటర్ల ఖర్చు రూ.1,150 కోట్లు  
స్మార్ట్‌ మీటర్ల కోసం కొత్త అంచనాల మేరకు ఒక్కో మీటరు రూ.6 వేల వంతున మొత్తం రూ.1,150 కోట్లు మాత్రమే ఖర్చుచేస్తున్నట్టు చెప్పారు. స్మార్ట్‌ మీటర్‌కు అనుబంధ పరికరాల నిర్వహణకు రూ.29 వేలు ఖర్చవుతుందంటూ ఈనాడు రాసిన రాతలో ఎటువంటి నిజం లేదన్నారు. బాబు చేయలేకపోయినది వైఎస్‌ జగన్‌ హయాంలో జరుగుతుందంటే రామోజీ జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. రామోజీరావుకు వయసు మీరేకొద్దీ కుట్రలు, కుతంత్రాలతో ప్రభుత్వంపై, సీఎం వైఎస్‌ జగన్‌పై అదేపనిగా తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు.

నాణ్యమైన విద్యుత్‌ సరఫరా , పారదర్శకత, జవాబుదారీతనం కోసమే స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎంత విద్యుత్‌ వాడుతున్నారో కచ్చితంగా తెలియడంవల్ల, కెపాసిటీ ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు పెట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. వ్యవసాయానికి వినియోగించే విద్యుత్‌ చార్జీలను డీబీటీ ద్వారా నేరుగా రైతు ఖాతాలకే జమచేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారన్నారు. దీనివల్ల రైతులు నేరుగా తమ ఖాతాల్లో జమ అయిన డబ్బును డిస్కంలకు చెల్లిస్తారన్నారు.

అలా చేయటం వల్ల రైతులకు డిస్కంలను అడిగే హక్కు లభిస్తుందని, డిస్కంలు కూడా బాధ్యతగా వ్యవహరించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పైలట్‌ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో 18 వేల మీటర్లు రైతుల మోటర్లకు బిగించామని, మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ఆ మీటర్ల వల్ల 30–36 శాతం విద్యుత్‌ ఆదా అవుతోందన్నారు. రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తే ఉరితాళ్లు అంటూ టీడీపీ అసత్య ప్రచారం చేసిందని తెలిపారు. గతంలో నాణ్యమైన కరెంటు ఇవ్వనందునే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు.

ప్రస్తుతం ఏటా 45 వేలకుపైగా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని, వాటి రిపేర్ల కోసమే ఏడాదికి రూ.102 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే 48 గంటల్లో పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు మరిన్ని ట్రాన్స్‌ఫార్మర్లను సిద్ధంగా ఉంచామన్నారు.

అదే టీడీపీ హయాంలో అయితే కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ని బిగించాలంటే సంవత్సరం పట్టేదని గుర్తుచేశారు. ఆ ట్రాన్స్‌ఫార్మర్‌కి కూడా రైతులు చందాలు వేసుకుని డబ్బులు చెల్లిస్తేనే ఇచ్చేవారన్నారు. తమ ప్రభుత్వంలో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోకుండా ప్రత్యేక కెపాసిటర్లు బిగిస్తున్నట్లు తెలిపారు. వీటివల్ల లో, హై ఓల్టేజి సమస్య లేదన్నారు. వ్యవసాయానికి పగటిపూటే కరెంట్‌ అందిస్తున్నా.. ఈనాడు అసత్య కథనాలు రాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.  

రామోజీకి మంత్రి సవాల్‌.. 
స్మార్ట్‌ మీటర్లకు సంబంధించిన టెండర్లను మరోవారం పొడిగిస్తున్నామని మంత్రి ప్రకటించారు. జ్యుడిషియల్‌ ప్రివ్యూ తర్వాత మీ పత్రికలోనే తేదీలను కూడా ప్రకటిస్తామని, దమ్ముంటే రామోజీరావు నేరుగా ఈ టెండర్‌లో పాల్గొనాలని సవాల్‌ విసురుతున్నానన్నారు. వారం గడువు ఇస్తున్నామని..  రామోజీరావు, లేదా ఆయన బలపరుస్తున్న చంద్రబాబు, అనుచరులు ఈ టెండర్‌లో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. టెండర్లలో  పాల్గొని తక్కువ ధరకు బిడ్‌ వేస్తే మీకే టెండర్‌ సొంతమవుతుందన్నారు.

దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని కోరారు. 95% రైతులు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. రైతులకు మేలుచేసే ప్రభుత్వం తమ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలో వ్యవసాయం దండగ అన్న సంస్కృతి వాళ్లదని, రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. మానసిక రుగ్మతతో చేసుకున్నారని టీడీపీ వారు హేళన చేసేవారని గుర్తుచేశారు. తమ పాలనలో అది లేదని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ వినూత్నంగా, పారదర్శకంగా రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నారని తెలిపారు.

రైతుభరోసా కేంద్రాల ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపట్ల అన్నదాతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇవన్నీ రామోజీకి నచ్చటం లేదని, ఆ అక్కసుతో అసత్య కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. రైతుల ముసుగులో టీడీపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. మంచిపనిని కూడా ఓర్వలేకే రైతుసంఘాల ముసుగులో టీడీపీ నాయకులు ఉరితాళ్లంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎం జగన్‌ పరిపాలనలో అందుతున్నట్టు గతంలో ఎప్పుడైనా అందిందా అని ప్రశ్నించారు. ఇలాంటి అంశాలను మరుగునపరచడమే కాకుండా, నాలుగేళ్లుగా పడుతున్న వర్షాలు కూడా చంద్రబాబుకు, రామోజీకి చాలా బాధ  కలిగిస్తున్నాయని అందుకే ఈ తప్పుడు రాతలు రాస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలపై కోర్టులో పోరాటం చేస్తున్నామని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement