2023లో కాంగ్రెస్‌దే గెలుపు

manicka tagore Says Congress Will Come To Power In 2023 - Sakshi

సాక్షి, సంగారెడ్డి/అర్బన్‌: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడానికి మిషన్‌ 2023 లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణికం ఠాగూర్‌ అన్నారు. రైతు, వ్యవసాయ వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసేందుకు నిర్వహిస్తున్న సంతకాలసేకరణ కార్యక్రమం కిసాన్‌ మజ్దూర్‌ బచావో దివస్‌ను జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి సెంటిమెంటని ఇక్కడినుంచే ఇందిరాగాంధీ 1979లో నామినేషన్‌ వేసి ఘన విజయం సాధించిందని తెలిపారు. అదే స్ఫూర్తితోనే గాంధీ జయంతి రోజున ఇక్కడ దీక్షా దివస్‌ను ఏర్పాటుచేశామని తెలిపారు. ఈ సభతో మళ్లీ కాంగ్రెస్‌ పుంజుకుంటుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ 79 సీట్లు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. అప్పుడు కేబినెట్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డికి చోటు ఉంటుందని చెప్పారు.  

రెండు మూడు రోజుల్లో.. 
తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థిని రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. ఈనెల 9వ తేదీ తరువాత జిల్లా నాయకులంతా దుబ్బాకకు మకాం మార్చి పార్టీ అభ్యర్థి గెలుపుకోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మాజీ మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదానీ, అంబానీలకు దేశాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. సన్న చిన్న కారు రైతులపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని, గల్లీనుంచి ఢిల్లీ వరకు రైతులు ఆక్రోశంతో ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఇంకా 10 లక్షల మందికి పట్టాదారు పాసు పుస్తకాలే ఇవ్వలేదని, దీంతో రైతుబంధు, రైతుబీమా పథకాలకు దూరమయ్యారని చెప్పారు. మాజీ ఎంపీ సురేష్‌ షెట్కార్‌ మాట్లాడుతూ.. కేంద్రం రైతు వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలన్నారు.  

కలసికట్టుగా పని చేయాలి 
డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ కలిసికట్టుగా పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం ఖాయమన్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ మెదక్‌ పార్లమెంటు కాంగ్రెస్‌ పార్టీకి సెంటిమెంటుగా ఉందని, అందుకే రాష్ట్ర వ్యాప్త సంతకాల సేకరణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడనుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనివాస్‌గౌడ్, నారాయణఖేడ్‌ ఇన్‌చార్జి సంజీవరెడ్డిలు మాట్లాడుతూ.. సంతకాల సేకరణలో కాంగ్రెస్‌ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను గద్దె దింపి అధికారంలోకి రావడానికి అంకిత భావంతో పనిచేయాలన్నారు. అనంతరం మహిళా రాష్ట్ర నాయకురాలు ఇంద్రాశోభన్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ అఖిలపక్షాన్ని తీసుకెళ్లి బిల్లులకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్‌ బాలయ్య, పీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, పీసీసీ అధికార ప్రతినిధి సిద్ధేశ్వర్, మాజీ ఎంపీపీ ఆంజనేయులు, నాయకులు గోదారి అంజిరెడ్డి, శివరాజ్‌పాటిల్, నర్సింహ్మారెడ్డి, పట్టణ అధ్యక్షులు జార్జ్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

భారీ బైక్‌ర్యాలీ 
రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా పదవీబాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన మాణిక్యం ఠాగూర్‌కు కాంగ్రెస్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పటాన్‌చెరు సమీపంలోని గణేష్‌గడ్డ నుంచి కంది, పోతిరెడ్డిపల్లి చౌరస్థా, కలెక్టరేట్, కొత్త బస్టాండు మీదుగా భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఇటీవల వర్షాలకు నష్టం జరిగిన పంటలను రైతులు సభ వేదిక వద్ద ప్రదర్శించారు. దీక్ష ప్రారంభానికి ముందు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు.  

ఒక్కటి కాదు.. ఐదు మంత్రి పదవులు 
2023లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కేబినెట్‌లో చోటు ఉంటుందని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణికం ఠాగూర్‌ సభ చివరలో చెప్పడం ఆసక్తికర చర్చకు దారితీసింది. దీంతో జగ్గారెడ్డి కలుగజేసుకొని నాతోపాటు సీనియర్‌ అయిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి గీతారెడ్డి.. ఇలా అందరికీ అవకాశం వస్తుందని తెలిపారు. స్పందించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురికి మంత్రి పదవులంటూ చమత్కరించారు. దీంతో జగ్గారెడ్డి కలుగజేసుకొని.. ఇలా అయితే ఉమ్మడి జిల్లాలోని 10 సీట్లు కాంగ్రెస్‌ గెలుచుకోవాలంటూ నవ్వడంతో అక్కడితో సభను ముగించేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top