బీజేపీతో ఉంటేనే పంజాబ్‌కు మంచిది

It Is Difficult To Survive Without The Support Of The National Party - Sakshi

జాతీయ పార్టీ అండ లేకుంటే మనుగడ కష్టం

కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు దాదాపు పదేళ్లు అధికారంలో ఉన్నపుడు ఎవరికీ పెద్దగా అందుబాటులో ఉండరనే అభియోగాలు కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌పై ఉండేవి. అవన్నీ తప్పుడు ఆరోపణలు అంటున్న ఈ 79 ఏళ్ల పాటియాలా రాజవంశ వారసుడు... హసం పార్టీని వీడి.. ఇప్పుడు పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ (పీఎల్‌సీ) పేరిట కొత్త పార్టీ పెట్టారు.

బీజేపీతో జట్టుకట్టి పంజాబ్‌ అసెంబ్లీ బరిలోకి దిగిన అమరీందర్‌ ఇప్పుడు రోజంతా ప్రచారంలో మునిగితేలుతున్నారు. అర్ధరాత్రి దాకా ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. బీజేపీతో ఉంటేనే పంజాబ్‌కు భవిష్యత్తు బాగుంటుందని.. జాతీయ పార్టీ అండ లేకుండా రాష్ట్రంలో సజావుగా పాలన సాధ్యమయ్యే పనికాదని అంటున్నారు అమరీందర్‌. కొత్త మిత్ర పార్టీ బీజేపీ నుంచి సంపూర్ణ సహకారం ఉందంటున్న ఆయన శుక్రవారం ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు... 

బీజేపీ– పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ కూటమికి అవకాశాలెలా ఉన్నాయని మీరు భావిస్తున్నారు? 
అమరీందర్‌: ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తోంది. పంజాబ్‌లో బీజేపీవైపు బయటికి కనిపించని మొగ్గు ఉంది. దానికి.. ఉజ్వల పథకం, ఉచిత రేషన్‌ సరఫరా, ఇతర సబ్సిడీలు కారణం. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న నా కూతురితో మోదీకే ఓటేస్తామని ప్రజలు చెబుతున్నారు. నా హయాంలోనూ పేదల కోసం ఎంతో చేశాను. ఐదు లక్షల రూపాయల ఆరోగ్యబీమా పథకాన్ని ప్రవేశపెట్టాను. దీని మూలంగా పేదవాళ్లకు పెద్దపెద్ద ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకునే అవకాశం లభించింది. 

పొత్తు కోసం బీజేపీనే ఎందుకు ఎంచుకున్నారు? 
బీజేపీతో కలిసి సాగడం పంజాబ్‌కు మంచిది. జాతీయ పార్టీ అండ లేనిదే పాలన సాధ్యం కాదు. కేంద్రం నుంచి నిధులు రాకపోతే.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు ఉండదు. బీజేపీ నాతో బాగానే ఉంటోంది. నాకైతే వారితో సమస్యలు లేవు. 1980లో నేను కాంగ్రెస్‌ ఎంపీగా ఎన్నికైనపుడు... మా అమ్మగారు బీజేపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారనేది గుర్తుపెట్టుకోండి. 

ఆమ్‌ ఆద్మీ పార్టీ గురించి మీ అభిప్రాయం ఏమిటి?  
ఆప్‌ రాజకీయ పార్టీయా? ఉద్యమ సంస్థా? అనేది నాకిప్పటికీ స్పష్టత రావడం లేదు. సంప్రదాయ రాజకీయ పార్టీల నుంచి దూరం జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే కిందటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే అన్నారు. రాజకీయ విశ్లేషకులైతే 2017లో ఆప్‌ 100 పైగా సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు. కానీ 20 దగ్గరే ఆప్‌ ఆగిపోయింది. ఇప్పుడు రైతు సంఘాల రాజకీయ వేదిక.. సంయుక్త సమాజ్‌ మోర్చా కూడా బరిలో ఉండటం ఆప్‌ అవకాశాలను మరింతగా దెబ్బతీస్తుంది.  

ఆర్థిక అధికారాలన్నీ కేంద్ర సర్కారుకే దఖలు పడ్డాయని మీరు అన్నారు. అదెవరి తప్పు? 
రాజ్యాంగం మనకు సమాఖ్య వ్యవస్థను నిర్దేశించింది. కానీ ప్రతిదీ కేంద్రీకృతమైపోయింది. రాష్ట్రాల అధికారాలన్నింటినీ ఒక్కొక్కొటిగా కేంద్ర ప్రభుత్వం తీసేసుకుంది. ఇదంతా కాంగ్రెస్‌ హయాంలోనే జరిగింది. కేంద్రంలో బీజేపీ వచ్చింది ఇటీవలి కాలంలోనే కదా. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) ద్వారా ఏకరూప పన్ను విధానం తేవాలనేది కూడా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ బుర్రలో పుట్టిన ఆలోచనే. జీఎస్‌టీలో రాష్ట్రాలకు న్యాయమైన వాటా దక్కడం లేదు. 

పాక్‌తో సరిహద్దును పంచుకుంటున్న పంజాబ్‌ రాష్ట్ర భద్రతపై మీరు తరచూ తీవ్రమైన ఆందోళన వెలిబుచ్చుతుంటారు? 
సరిహద్దుల అవతల నుంచి నిరంతరం డ్రోన్లు భారత భూభాగంలోకి చొరబడుతున్నాయి. చైనా– పాక్‌తో జట్టు కట్టింది. తాజాగా ఆఫ్గానిస్తాన్‌ నుంచీ ముప్పు పొంచి ఉంది. ఇది పంజాబ్‌కు అభిలషణీయమైన భద్రతా స్థితి కాదు. ఆధునిక ఆయుధ సంపత్తిలో శత్రుదేశాలు మనకంటే ఎంతో ముందంజలో ఉన్నాయి. 2004 నుంచి 2014 దాకా పదేళ్లకాలంలో ఆయుధ సమీకరణ, నవీకరణకు కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు. కనీసం బీజేపీ ఇప్పుడు ఆయుధ వ్యవస్థలనైనా కొంటోంది. 

పంజాబ్‌లో కులం, మతం ఆధారంగా ఓట్ల పునరేకీకరణ జరుగుతుందని భావిస్తున్నారా? 
ఇది పూర్తి అర్థంపర్థం లేని వ్యవహారం. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటిపోయాక కూడా ఇంకా కులం, మతం అంటూ మాట్లాడుతున్నాం. ప్రస్తుత పంజాబ్‌ సీఎం చన్నీ కుల ప్రస్తావన ఎందుకు? దేనికైనా ప్రతిభే కొలమానం కావాలి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top