Etela Rajender: ఈటలతో పాటే తుల ఉమ రాజీనామా?!

Etela Rajender Resignation Ground Realities In Huzurabad In Karimnagar - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఊహించినదే జరిగింది. నెలరోజుల ఉత్కంఠకు ముగింపు లభించింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తనకు రాజకీయ జీవితాన్నిచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. తన మద్దతుదారులతో కలిసి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకుంటానని ప్రకటించారు. దీంతో 19 సంవత్సరాల పాటు టీఆర్‌ఎస్‌తో ఉన్న అనుబంధానికి ఫుల్‌స్టాప్‌ పడింది.

ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకులను కలిసి వచ్చిన తరువాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను వదిలి బీజేపీలో చేరాలని ఈటల నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తరువాతే బీజేపీలో చేరాలనే నిబంధన మేరకే ఆయన శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. ఒకటి రెండు రోజుల్లో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి తన రాజీనామా లేఖను పంపించనున్నారు.

ఈ వారం రోజుల్లోనే ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది. 11వ తేదీ వరకు మంచిరోజులు లేకపోవడంతో బీజేపీలో చేరిక కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు ఈటల వర్గాల ద్వారా తెలిసింది. ఈటల రాజీనామా ఆమోదం పొందితే మరోసారి హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్యం కానుంది. 

పార్టీ కార్యకర్త నుంచి మంత్రిగా ఎదిగి..
తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్‌ కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు టీఆర్‌ఎస్‌ స్థాపించిన తరువాత 2002లో ఈటల రాజేందర్‌ గులాబీ కండువా కప్పుకున్నారు. ఉద్యమాల ఖిల్లాగా పేరొందిన కరీంనగర్‌ జిల్లా నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన కొద్దిమంది ముఖ్య నాయకుల్లో ఆయన ఒకరు. బీసీ వెల్ఫేర్‌ హాస్టల్‌లో చదువుకొని పౌల్ట్రీ పరిశ్రమను స్థాపించిన ఈటలను కేసీఆర్‌ ప్రోత్సహించారు. అందులో భాగంగానే సామాన్య కార్యకర్తగా పార్టీలో చేరిన ఆయనకు రాజకీయంగా అవకాశాలు కల్పించారు.

కేసీఆర్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొనడం, బీసీ నాయకుడిగా గొంతెత్తడం ఉత్తర తెలంగాణలో ఆయన కీలక నేతగా ఎదిగేందుకు దోహదపడ్డాయి. ఈ క్రమంలోనే కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో పార్టీ ముఖ్య నాయకుల్లో ఒకరిగా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పలు పదవులు నిర్వర్తించారు.

 • 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కమలాపూర్‌ నుంచి పోటీ చేసి అప్పటి టీడీపీ నేత, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌ రెడ్డిపై తొలిసారి విజయం సాధించారు. 
 • నాటి నుంచి వెనుదిరిగి చూడని ఈటల 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 
 • 2009లో శాసనసభ స్థానాల పునర్విభజనలో హుజూరాబాద్‌కు వెళ్లిన ఈటల మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. 
 • 2010లో తెలంగాణ ఆత్మగౌరవ నినాదంతో జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిచారు. 
 • శాసనసభలో టీఆర్‌ఎస్‌ ఎల్‌పీ నాయకుడిగా 2014 వరకు కొనసాగారు. 
 • 2014లో రాష్ట్ర అవతరణ అనంతరం జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి కేసీఆర్‌ కేబినెట్‌లో ఏకంగా ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 
 • 2018 ఎన్నికల్లో గెలిచి టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు హుజూరాబాద్‌ ఎమ్మెల్యేగానే రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 
 • తరువాత జరిగిన పరిణామాలతో నెలరోజుల క్రితం మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన ఈటల ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశారు. రేపోమాపో ఎమ్మెల్యే పదవికి గుడ్‌బై చెప్తారు.
 • నియోజకవర్గంలోని ప్రతీ మండలం     నుంచి కనీసం 50 మందికి తగ్గకుండా స్థానిక నాయకులు శుక్రవారం శామీర్‌పేటలోని ఈటల నివాసానికి వెళ్లి మద్దతు ప్రకటించారు. 
 • కాగా.. ఈటల టీఆర్‌ఎస్‌కి రాజీనామా చేసి హుజూరాబాద్‌కు రానున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ కౌంటర్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. 
 • ఉప ఎన్నిక అనివార్యం అని తేలడంతో మాజీ మంత్రిపై ముప్పేట దాడికి టీఆర్‌ఎస్‌ రంగం సిద్ధం చేస్తోంది.  
 • ఈనెల 11, 12 తేదీల్లో మంత్రులు హరీశ్‌ రావు, గంగుల కమలాకర్, కొప్పుల     ఈశ్వర్, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్‌ తదితర ముఖ్య నాయకులతో హుజూరాబాద్‌లో పర్యటన ఖరారైంది. 
 • మొత్తంగా మండలాల్లో ఈటలకు మద్దతుగా ని లిచిన పార్టీ కేడర్‌ను కూడా ఆయనకు దూరం చేసే ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఈటల రాజీ నామా ప్రకటన తరువాత ఆయన సొంత మండలం కమలాపూర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు శుక్రవారం సంబరాలు చేసుకోవడం, కేసీఆర్‌ ఫొటో కు క్షీరాభిషేకం చేయడం వంటి చర్యలు గులాబీ పార్టీ వ్యూహాన్ని బహిర్గతం చేస్తోంది. ఈటల రాజీనామాతో రాజకీయం మరింత వేడెక్కింది.  

ముప్పేట దాడికి టీఆర్‌ఎస్‌ ప్రణాళిక
మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైనప్పటి నుంచే ఈటల రాజేందర్‌పై టీఆర్‌ఎస్‌ అధిష్టానం నజర్‌ పెట్టింది. కరీంనగర్‌ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌ను ఇన్‌చార్జిగా నియమించింది. హుజూరాబాద్‌ నుంచి టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులెవ్వరూ ఆయన వెంట వెళ్లకుండా ‘కట్టుదిట్టమైన’ ఏర్పాట్లు చేయించింది.

ఈ క్రమంలో ప్రస్తుతం ఈటల వెంట జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమతోపాటు హుజూరాబాద్‌కు చెందిన కొందరు నాయకులు మినహా ఎవరూ వెళ్లలేదు. ప్రజాబలం తనకు ఉందని చెపుతున్న ఈటలను ప్రజాప్రతినిధులను కట్టడి చేయడంతో ఇరుకున పెట్టి విజయం సాధించారు. ఈ క్రమంలో ఆయన పార్టీకి రాజీనామా చేశారు.
చదవండి: ఈటల వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ నేతల కౌంటర్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top