కేసీఆర్‌కు.. యాదయ్య కుటుంబం కనిపించడం లేదా?

Congress Leader Revanth Reddy Fires Cm Kcr Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తన రాజకీయ అవసరాలకు దేశవ్యాప్తంగా అమర జవాన్లు, రైతుల కుటుంబాలకు రాష్ట్ర ఖజానా నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్న సీఎం కేసీఆర్‌కు.. తెలంగాణకు చెందిన యాదయ్య కుటుంబం కనిపించకపోవడం శోచనీయమని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అనే సామెత సీఎం వ్యవహారశైలికి సరిగ్గా సరి పోతుందన్నారు. ఈ మేరకు ఆయన గురు వారం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

పన్నుల సొమ్ము పప్పు బెల్లాల మాదిరి..
‘తెలంగాణ ప్రజలు తమ చెమట, రక్తం, కష్టార్జితం నుంచి కట్టిన పన్నుల సొమ్మును మీరు.. అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన విధంగా దేశమంతా తిరిగి పప్పు బెల్లాల మాదిరి పంచుతున్నారు. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా అమర జవాన్లు, రైతు కుటుంబాల పట్ల కాంగ్రెస్‌కి సానుభూతి ఉంది. కానీ ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత చందంగా వ్యవహరించడం గర్హనీయం. బిహార్‌లో పర్యటించి గాల్వాన్‌ లోయ అమర వీరుల కుటుంబాలకు పరిహారం అందజేత లో మీ రాజకీయ ప్రయో జనం, రాజ్యాధికార విస్త రణ కాంక్షే ఎక్కువగా కనిపించింది’ అని రేవంత్‌ ధ్వజమెత్తారు. 

వారిని ఆదుకోండి..
‘అమర జవాన్లపై మీకు నిజంగా సానుభూతి ఉంటే, 2013లో కశ్మీర్‌లో ఉగ్రవాదుల తూటాలకు బలైన దళిత బిడ్డ మహబూబ్‌ నగర్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డి పల్లెకు చెందిన మల్లెపాకుల యాదయ్య కుటుంబం ఎందుకు కన్పించడం లేదు? యాదయ్య చనిపోయినప్పుడు మీ కుమార్తె కవిత ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఐదెకరాల భూమి, ఇంటి స్థలం, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చా రు. ఆ హామీకి అతీగతీ లేదు. మన తెలంగాణ బిడ్డ అమరుడై, ఆయన కుటుంబం దిక్కులేనిదై రోడ్డున పడితే పట్టించుకోని మీరు.. ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న బిహార్‌ రాష్ట్రంలోని అమర జవాన్లకు పరిహారం ఇవ్వడం పరిహాసంగా అనిపించడం లేదా? ఇదేనా అమర జవాన్ల కుటుంబాల పట్ల మీకున్న చిత్తశుద్ధి?’ అని నిలదీశారు. ఇప్పటికైనా దేశం కోసం ప్రాణాలు అర్పించిన యాదయ్య కుటుంబాన్ని గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆదుకోవాలని రేవంత్‌ కోరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top