నా గడ్డపైకొచ్చి నన్నే అవమానిస్తావా? | Sakshi
Sakshi News home page

నా గడ్డపైకొచ్చి నన్నే అవమానిస్తావా?

Published Sat, May 11 2024 6:05 AM

CM Revanth Reddy Comments On PM Modi

అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా 

లేదంటే తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెబుతారా? 

ప్రధాని మోదీపై సీఎం రేవంత్‌ విసుర్లు 

మక్తల్‌లో జనజాతర సభ, షాద్‌నగర్,  బేగంబజార్‌ చౌరస్తాల్లో రేవంత్‌ రోడ్‌షోలు 

బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని ధ్వజం

సాక్షి, రంగారెడ్డి జిల్లా, సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్, అబిడ్స్‌
‘నల్లమల మట్టిలో పుట్టిపెరిగాను. సాధారణ కార్యకర్తగా, జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేశా. ఒక్కో మెట్టు ఎదుగుతూ స్వశక్తితో నేడు ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నా. రాజకీయాల్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా. ప్రధాని మోదీ నన్ను అభినందించాల్సింది పోయి అక్రమార్కులను, అవినీతి పరులను పక్కన పెట్టుకుని, నాపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు.

ఎవరు అవినీతి పరులో, అక్రమార్కులో చర్చకు సిద్ధమా? నేను అక్రమ వసూళ్లకు, అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే షాద్‌నగర్‌ అంబేడ్కర్‌ విగ్రహం సాక్షిగా ముక్కు నేలకు రాసేందుకు సిద్ధం. ఒక వేళ నిరూపించకపోతే.. ప్రధాని మోదీ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పగలరా?’ అని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా రోడ్‌షో అనంతరం షాద్‌నగర్‌ అంబేడ్కర్‌ చౌరస్తాలో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో, నారాయణపేట జిల్లా మక్తల్‌లో నిర్వహించిన జనజాతర బహిరంగసభల్లో సీఎం మాట్లాడారు.

అదేవిధంగా శుక్రవారం రాత్రి హైదరాబాద్‌ బేగంబజార్‌ చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌ షోలో ప్రసంగించారు. ఆయా సభల్లో రేవంత్‌ మాట్లాడుతూ.. ’’బీజేపీ అభ్యర్థి డీకే అరుణ కుటుంబం దొంగసార అమ్మింది. భూములు కొల్లగొట్టింది. కల్లు దుకాణాల నుంచి వసూళ్లకు పాల్పడింది. ఇసుకు దందా చేసింది. అలాంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుని, నా గడ్డకు వచ్చి నన్ను అవమానిస్తావా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు?’’ అని మోదీని నిలదీశారు.

బీజేపీ వస్తే వందేళ్లు వెనక్కి..
పొరపాటున బీజేపీకి ఓటేస్తే మతాల మధ్య చిచ్చు, మనుషుల మధ్య పంచాయితీలు పెట్టి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తుందని, అభివృద్ధి వందేళ్లు వెనక్కి వెళుతుందని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘బీజేపీ గెలిస్తే ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో  చిచ్చుపెట్టి పెట్టుబడులు రాకుండా చేస్తారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉన్నా ఎందుకు పెట్టుబడులు పోతలేవు. నిత్యం పంచాయితీలు, విషం చిమ్ముతూ ఆ రాష్ట్రాన్ని నాశనం చేశారు.

పార్లమెంట్‌ నుంచి 30 నిమిషాల దూరంలోనే నోయిడా సిటీ ఉన్నా బీజేపీ నేతలకు చిత్తశుద్ధి లేక  అభివృద్ధికి నోచుకోలేదు.  తప్పిపోయి బీజేపీ కేంద్రంలో మళ్లీ వస్తే అభివృద్ధి వందేళ్లు వెనక్కు పోతుంది.’ అని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్‌కు ఎయిర్‌పోర్టు, ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, గోదావరి జలాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు.

బీజేపీకి 400 సీట్లు కలే
కేంద్రంలో 400 సీట్లు రావాలని కలలు కంటున్న బీజేపీకి అవి పగటి కలలుగానే మిగిలిపోతాయని రేవంత్‌ ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ బీజేపీకి అమ్ముడు పోగా, బీజేపీ, మజ్లిస్‌ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో బీజేపీ, మజ్లిస్‌లు గొడవలకు దిగి హైదరాబాద్‌లో శాంతిభద్రతల సమస్యను సృషించాలని చూస్తున్నాయన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల సమస్యలు ఏర్పడితే రాష్ట్రానికి వచ్చే మలీ్టనేషనల్‌ కంపెనీలను గుజరాత్‌కు తరలించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని విమర్శించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement