
సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలో బీఆర్‌ఎస్ ఎంపీలు కీలకంగా వ్యవహరించారు.
రాహుల్‌కు మద్దతుగా పార్లమెంట్ లోపలా, బయటా కాంగ్రెస్ నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ముందు వరుస లో ఉన్న ఎంపీలు, కేంద్రం తీరును తప్పుపట్టారు. రాహు ల్‌పై తీసుకున్న చర్యను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాహుల్‌పై అనర్హత వేటు, అదానీ వ్యవహారంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఆర్‌ఎస్ ఎంపీలు సోమవారం నల్ల చొక్కాలతో పార్లమెంటుకు వచ్చారు.
విపక్షాల భేటీకి కేకే
ఉభయ సభలు ప్రారంభం కావడానికి ముందే.. ప్రధాన ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నిర్వహించిన విపక్షాల భేటీకి బీఆర్‌ఎస్ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌పై అనర్హత వేటుతో పాటు ఇతర అంశాలపై నిరసన కొనసాగించాలని నిర్ణయించగా, దీనికి బీఆర్‌ఎస్ సహా మిగ తా విపక్ష పార్టీలన్నీ అంగీకరించాయి.
ఈ మేరకు ఉభయ సభలు ఆరంభం కాగానే విపక్షాలన్నీ కలిసి ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. అనంతరం గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ నేతృత్వంలో చేపట్టిన నిరసనలో బీఆర్‌ఎస్ ఎంపీలు కేకే, నామా నాగేశ్వరారవు, జోగినపల్లి సంతోష్‌కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేశ్‌రెడ్డి, బడుగు లింగయ్యయాదవ్, దామోద రరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఖర్గేతో పాటు మీడియాతో మాట్లాడిన కేకే.. రాహుల్ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడంపై మండిపడ్డారు. అనంతరం ‘సత్యమేవ జయతే’ అనే భారీ పోస్టర్‌ను ప్రదర్శిస్తూ పార్లమెంటు నుంచి విజయ్‌చౌక్ వరకు విపక్షాలు నిర్వ హించిన మార్చ్‌లోనూ బీఆర్‌ఎస్ ఎంపీలు పాల్గొన్నారు.
ఇదో ఫాసిస్టు ప్రభుత్వం: ఎంపీలు కేకే, నామా
రాహుల్ అనర్హత అంశాన్ని బీజేపీ వర్సెస్ రాహుల్‌గా చూడొద్దని, ఇది దేశం వర్సెస్ న్యాయంగా చూడాలని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే అన్నారు. ప్రజల గొంతును అణిచివేసేలా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. ‘ఇది ఫాసిస్టు ప్రభుత్వం. చట్ట స్ఫూర్తిని పూర్తిగా దెబ్బతీస్తోంది. రాహుల్ సహా అనేక అంశాల్లో ఇష్టారీతిగా వ్యవహరిస్తోంది..’ అని ధ్వజమెత్తారు.
రాహుల్ ఓబీసీలను అవమాన పరిచారన్న వ్యాఖ్యలపై కేకే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మోదీ అనేది ఇంటిపేరు. దాన్ని కులం పేరుగా ఎలా చూస్తారు. నా పేరుతో పాటు పీవీ నరసింహారావు, చంద్రశేఖర్‌రావు, జీవీఎల్ నరసింహారావుల్లో.. రావు అనేది కామన్. అదేమైనా కులమా? అది కేవలం ఇంటి పేరు మాత్రమే..’ అని పేర్కొన్నారు. రాహుల్ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం శోచనీయమని నామా అన్నారు.