
పూర్ణియా : కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ ఏకమై పోరాడితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వంద సీట్లకే కట్టడి చేయవచ్చని బిహార్ సీఎం నితీశ్ కుమార్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలతో జట్టుకట్టే విషయంలో కాంగ్రెస్ తొందరగా ఒక నిర్ణయానికి రావాలన్నారు. ‘నా సూచనను మీరు అంగీకరిస్తే కాషాయ పార్టీని 100 సీట్లలోపే కట్టడి చేయవచ్చు. అంగీకరించని పక్షంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు’అని ఆయన కాంగ్రెస్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు.
ప్రతిపక్షాలను ఏకం చేసి, బీజేపీని అధికారం పీఠం నుంచి దించేయడమే తన ఏకైక లక్ష్యమన్నారు. తన లక్ష్యం సాకారమయ్యేందుకు కృషి చేస్తున్నానని, బీజేపీని దేశంలో లేకుండా చేయాలని ఆయన పేర్కొన్నారు. బిహార్‌లోని పూర్ణియా లో శనివారం జరిగిన మహాఘఠ్‌బంధన్ ర్యాలీలో నితీశ్ ప్రసంగించారు.
బీజేపీవి విభజన రాజకీయాలు: లాలూ
కుల, మత ప్రాతిపదికన దేశప్రజలను విభజించే కుట్రకు బీజేపీ తెరతీసిందని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఢిల్లీకి చేరుకున్న లాలూ అక్కడి నుంచే పూర్ణియాలో మహాకూటమి ర్యాలీనుద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. ‘మైనారిటీలంటే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు గిట్టదు. కులం, మతాల వారీగా జనాన్ని విడగొట్టడమే బీజేపీ పని. బీజేపీని ఓడించే సంకల్పానికి బిహార్ నుంచి శ్రీకారం చుడదాం’ అని పిలుపునిచ్చారు.