కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో తాము ఓడిపోలేదని, నైతికంగా తామే గెలిచామని, సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి స్పందించారు. సీఎం పదవికి మమత రాజీనామా చేయనంటే కుదరదని సువేందు అధికారి పేర్కొన్నారు. రాజ్యాంగంలో ప్రతీది రాసి ఉందని, ఓడిపోయాక రాజీనామా చేయనంటే సాధ్యమయ్యే పనినే అంటూ ప్రశ్నించారు. మమత వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామని సువేందు అధికారి తెలిపారు.
కాగా, బెంగాల్‌లో నైతిక విజయం తమదేనని అన్నారు మమతా బెనర్జీ. ఓట్లను, సీట్లను చోరీ చేసి బీజేపీ గెలిచిందని విమర్శించారు. అదే సమయంలో తాను సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను లోక్‌భవన్‌కు వెళ్లనని, అక్కడకు వెళ్లి రాజీనామా చే యాల్సిన అవసరం కూడా లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తాము ఓడిపోలేదని, బీజేపీ సీట్లు దొంగిలించిన కారణంగానే ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మమతా బెనర్జీ మరోసారి ఆరోపించారు. తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న మమతా, కోల్‌కతా నుంచి ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ..‘ మేము ఎన్నికల్లో ఓడిపోలేదు. 100 సీట్లను బిజెపి దొంగిలించింది. ఇది బీజేపీ విక్టరీ కాదు.. లూటీ. బెంగాల్ ఎన్నికల్లో ఈసీ విలన్. ప్రతిపక్ష నేతలు వేధించడం బిజెపికి అలవాటు’ అంటూ ధ్వజమెత్తారు.


