ఖాళీ చేయించారు సరే.. | - | Sakshi
Sakshi News home page

ఖాళీ చేయించారు సరే..

Apr 11 2026 9:10 AM | Updated on Apr 11 2026 9:10 AM

● పనులు ఎప్పడు ప్రారంభిస్తారు? ● అద్దె భవనంలోకి జిల్లా గ్రంథాలయం

పెద్దపల్లిరూరల్‌: జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణంలో జిల్లా గ్రంథాలయానికి ఆధునిక హంగులు జోడించి కొత్త భవనం నిర్మించేందుకు పాలకులు చర్యలు చేపట్టారు. స్థానిక ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌ ఆవరణలోని ప్రభుత్వ భవనంలోనే ఇప్పటివరకు జిల్లా గ్రంథాలయం కొనసాగింది. అదేస్థలంలో రూ.6కోట్ల వ్యయంతో ఆధునిక హంగులతో సొంత భవనం నిర్మించేందుకు పాలకులు, అధికారులు సన్నద్ధమవుతున్నారు.

పాత భవనం కూల్చివేత.. అద్దె భవనంలో లైబ్రరీ..

కొత్త భవన నిర్మాణం కోసం జిల్లా గ్రంథాలయాన్ని శాంతినగర్‌ ప్రాంతంలోని ఓ అద్దెభవనంలోకి ఇటీవల మార్చారు. కింది భవనంలో జిల్లా గ్రంథాల య సంస్థ కార్యాలయం ఉండగా, పైఅంతస్తులో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. సీనియర్‌ సిటిజ న్లు మెట్లు ఎక్కి పైకివెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పాఠకులకు సౌకర్యంగా ఉండేల గ్రంథాలయసంస్థ పాలకమండలి, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని పాఠకులు కోరుతున్నారు.

కూలనున్న భవనం ఇదే..

జిల్లా కేంద్రంలోని ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహాన్ని ఆనుకుని ఉన్న భవనాన్ని కూల్చి అదేస్థలంలో రూ.6 కోట్ల వ్యయంతో బహుళ అంతస్తుల భవనం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గ్రంథాలయ సంస్థ అధికారులు తెలిపారు. ఈ భవనంలో మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సహకారంతో డిజిటల్‌ లైబ్రరీ తదితర సౌకర్యాలు కల్పిస్తారు. పోటీపరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అనుకూలంగా అన్ని వసతులు కల్పించేలా దృష్టి సారిస్తామని జిల్లా గ్రంధాలయసంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్‌ తెలిపారు. వీలైనంత త్వరలోనే భవన నిర్మాణం ప్రారంభిస్తామని ఆయన వివరించారు.

శాంతినగర్‌లోని అద్దెభవనంలో జిల్లా గ్రంథాలయం

కొత్త భవన నిర్మాణం కోసం కూల్చివేసే పాత భవనం

Advertisement
 
Advertisement
Advertisement