● రోజుల వ్యవధిలో వరుస ప్రమాదాలు ●పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు ● క్షతగాత్రులుగా మారుతున్న మరికొంత మంది ●జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఘాట్ రోడ్లు.. ● బ్లాక్‌స్పాట్లుగా గుర్తించకుంటే కష్టం
పాలకొండ రూరల్/ సీతంపేట:
ఏజెన్సీ అందాలు కలబోసి ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాలో రహదారి ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. రోజు ఏదో ఒక చోట రహదారి ప్రమాదాల బారిన పడి మృతి చెందడం..లేకుంటే తీవ్ర గాయాలపాలై క్షతగాత్రులుగా మారడం పారిపాటి. దీంతో అనేక కుటుంబాల్లో చీకట్లు అలుముకుంటున్న విషయం విదితమే. జిల్లాలోని 15 మండలాల పరిధిలో విస్తరించి ఉన్న ఏజెన్సీలో ఘాట్ రోడ్లు, ప్రమాదకర మలుపులు అనేకం. ముఖ్యంగా సీతంపేట, భామిని మండలాలకు వెళ్లాలంటే అనేక మలుపులు, ఛిద్రమైన రహదారులు దాటాల్సి ఉంది. ఈ మండలాలతో పాటు కురుపాం, జియ్యమ్మవలస, కొమరాడ, పాచిపెంట, మ క్కువ, గుమ్మలక్ష్మీపురం తదితర ప్రాంతాల్లో అంతర్గత గ్రామాలకు వెళ్లాల న్నా అనేక సమస్యలు అధిగమించాల్సి ఉంది. ముఖ్యంగా జెడ్, ఎస్, హెయిర్ పిన్ మలు పులతో పాటు ఘాట్ రోడ్లు విస్తరించి ఉన్నాయి. దీనికితోడు గిరిజన ఆవాసాలు,గూడలు అధికంగా కొండలపై ఉండడం, అక్కడికి రవాణా సౌకర్యం అంతంత మాత్రంగా ఉండడంతో వారు ద్విచక్రవాహనాలు ఆటోలు, వ్యాన్లు, మినీ జీపులు, మ్యా క్సీ క్యాబ్‌లపై ఆధారపడుతన్నారు. ఈ క్రమంలో ఏ చిన్న ప్రమాదం సంభవించినా పదుల సంఖ్య లో ప్రయాణికులు ప్రమాదంలో చిక్కుకుంటున్నారు.
ఇటీవల కాలంలో..
ఇటీవల నాలుగు రోజుల క్రితం పాలకొండ మండలం జంపరకోటకు చెందిన 11 మంది ఓ ఆటోలో సీతంపేట మండలంలో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తూ ఇదే మండలం మేడకోట ఘాట్ రోడ్డు మలుపు వద్ద ఆటో అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాత పడగా మిగిలినవారు తీవ్రగాయాల పాలయ్యారు. ఇదే మండలం వాబ గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో దంపతులు రెండు రోజుల వ్యవధిలో మరణించారు. సీతంపేట పరిధిలో ఆడలి వ్యూ పాయింట్ వద్దకు వెళ్లి వచ్చే క్రమంలో ఘాట్ రోడ్ల మలుపుల వద్ద తరచూ ఆటోలు, ద్విచక్రవాహనాలు, ఇతర వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ ఘటనల్లో దాదాపు ఆరుగురు మరణించగా మరి కొందరు ఆస్పత్రుల పాలయ్యారు. పాలకొండ మండలం సిరికొండ, మంగళాపురం, తంపటాపల్లి, అట్టలి, వీరఘట్టం మండలం తూడి, ఎం.రాజపురం, కెల్ల తదితర గ్రామాల మలుపుల వద్ద అనే క రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. గుమ్మలక్షీపురం మండలం కల్లిగట్టు కూడలి, గోరటి ఘాట్‌రోడ్డు, మండ రోడ్డులో మలుపు, సాలూరు మండలం రొడ్డవలస, కరడవలస, ఒకటవ మైలు రాయి ఘాట్ రోడ్డు మలుపులు, జీగ్రామ్ సాలూరు బైపాస్ రోడ్డు, కొమరాడ మండలం బంగారంపేట సమీపంలో మలుపు, మక్కువ మీదుగా దుగ్గేరు, పార్వతీపురం మండలంలో చినమరికి, పెద మరి కి మీదుగా ఒడిశా రహదారి, నర్సిపురం రోడ్డు, పాచిపెంట మండలంలో పి.కోనవలస(సుంకి) ఘాట్ రోడ్డు, గరుగుబిల్లి మండలంలో తోటపల్లి కుడికాలువ రోడ్డు, నందివానివలస, అడ్డాపుశిల రోడ్డులో ప్రమాదాలు పరిపాటిగా జరుగుతున్నట్లు ఆయా ప్రాంతవాసులు చెబుతున్నారు.
బ్లాక్ స్పాట్లుగా గుర్తించాలి
నిత్య ప్రమాదాలకు నెలవుగా మారుతున్న రహదారులు, ఘాట్ రోడ్లు, మలుపులను బ్లాక్ స్పాట్లుగా గుర్తించాలి. సంబంధిత అధికారుల సమన్వయంతో అవసరమైన చోట వేగనిరోధకాలు, హెచ్చరిక బోర్డులు, ఘాట్ రోడ్లలో రక్షణ గోడలు, రెయిలింగ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే జిల్లాలో ఏటా దాదాపు మూడు వందల వరకూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ ప్రమాదాలు ఎక్కువగా ఏజెన్సీలోనే జరుగుతున్నాయి.


