ఆండ్ర భూముల ఆక్రమణ | - | Sakshi
Sakshi News home page

ఆండ్ర భూముల ఆక్రమణ

May 5 2026 7:20 AM | Updated on May 5 2026 7:20 AM

పట్టించుకోని యంత్రాంగం

ఆవేదనలో నిర్వాసిత గిరిజనులు

రిజర్వాయర్‌ భూమిని జేసీబీతో చదును చేస్తున్న దృశ్యం

మెంటాడ: మండలంలోని ఆండ్ర రిజర్వాయర్‌ ముంపు భూములు దురాక్రమణకు గురవుతున్నాయి. జేసీబీతో చదును చేస్తున్నా రెవెన్యూ అధికారులు కనీసం కన్నెత్తి చూడడంలేదు. భూముల ఆక్రమణల వెనుక అధికారపార్టీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెంటాడ మండలంలోని లోతుగెడ్డ, నిక్కలవలస, ఆండ్ర గ్రామాల రెవెన్యూ పరిధిలో సుమారు వెయ్యిఎకరాల విస్తీర్ణంతో ఆండ్ర రిజర్వాయర్‌ను నిర్మించారు. అవసరమైన భూములను రైతు ల నుంచి సేకరించారు. అయితే, రిజర్వాయర్‌ వల్ల పూర్తిగా భూములు కోల్పోయిన గిరిజనులు రిజర్వాయర్‌లో ముంపు కాకుండా ఖాళీగా ఉన్న భూముల్లో వ్యవసా యం చేయడానికి సిద్ధపడితే అప్పటి రెవెన్యూ ఇరిగేష న్‌ అధికారులు అడ్డుకున్నారు. నిక్కలవలస రెవెన్యూ లో అధికంగా భూములున్న వ్యక్తి చుట్టుపక్కల ఉన్న వాగులు, గెడ్డపోరంబోకు ప్రభుత్వ భూములన్నింటి నీ చదునుచేసి కలిపేసుకున్నా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు రిజర్వాయర్‌ భూములపై అతని కన్ను పడింది. కిందటి వేసవిలో రిజర్వాయర్‌లో నీరు తగ్గగానే భూములను చదును చేయడానికి ప్రయత్నిస్తే గిరిజన నిర్వాసితులు అడ్డుకున్నారు. మళ్లీ రెండు రోజుల నుంచి జేసీబీతోల చదును చేస్తున్నారు. నిర్వాసిత గిరిజనులు వెళ్లి అడ్డుకున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కిమ్మనకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదెక్కడి అన్యాయం

నా భూమి 5 ఎకరాలు రిజర్వాయర్‌లో కలిసిపోయింది. సెంటు భూమి కూడా మిగల్లేదు. రిజర్వాయర్‌ ఒడ్డున ఎప్పుడూ నీటి ముంపునకు గురికాని భూములను వ్యవసాయం చేద్దామంటే అధికారులు కుదరదని వెళ్లగొట్టారు. బయటి నుంచి వచ్చి ఈ ప్రాంతంలో భూములను కొనుగోలుచేసి చుట్టు పక్కల ప్రభుత్వ భూములను, రిజర్వాయర్‌ భూములను ఆక్రమించేస్తున్నా అతడిని మాత్రం రెవెన్యూ అధికారులు ఏమీ అనడంలేదు.

– ఇంటి నరసింహులు,

నిక్కలవలస, ఆండ్ర రిజర్వాయర్‌ నిర్వాసిత రైతు

చర్యలు తీసుకుంటాం

ప్రభుత్వ భూములు, వాగులు, గెడ్డపోరంబోకు భూములు, రిజర్వాయర్‌ భూములు ఆక్రమించడం చట్టరీత్యా నేరం. ఆక్రమిస్తే క్షేత్ర పరిశీలన చేసి చర్యలు తీసుకుంటాం.

– విజయభాస్కర్‌, తహసీల్దార్‌, మెంటాడ

Advertisement
 
Advertisement
Advertisement