ప్రజాగ్రహం
పల్లెలు.. పట్టణాల్లో వెల్లువెత్తిన నిరసన
వైఎస్సార్‌సీపీ కోటి సంతకాలకు అపూర్వ స్పందన
నేడు విజయనగరం, పార్వతీపురం – మన్యం జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు
ఉమ్మడి జిల్లాలో సేకరించిన కోటి సంతకాల ప్రతులు విజయవాడకు తరలింపు
18న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విరమించుకోవాలంటూ గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులు అందజేత
నేడు జిల్లా కేంద్రాల్లో ప్రజా చైతన్య ర్యాలీలు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించ తల పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15న సోమ వారం విజయనగరం, పార్వతీపురం–మన్యం జిల్లా కేంద్రంలో ఆయా జిల్లా పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ప్రజా చైతన్య ర్యాలీలు నిర్వహించనున్నారు. పార్టీ ఆదేశాల మేరకు ఇప్పటికే నియోజకవర్గ కేంద్రాల నుంచి సేకరించిన కోటి సంతకాల ప్రతులను జిల్లా కేంద్రాల నుంచి విజ యవాడలోని పార్టీ కార్యాలయానికి తరలించనున్నారు. అనంతరం ఈ నెల 18న పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర గవర్నరుకు కోటి సంతకాలు అందజేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కోరనున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో విస్తృత పరించేందుకు చేపట్టిన ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని మద్దతు తెలియజేయటం ద్వారా ర్యాలీలను విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు పిలుపునిచ్చారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం :
ప్రజా వైద్యాన్ని ప్రైవేటుపరం చేస్తూ తమనెవ రూ ఆపలేరని... తన మాటే శాసనమని విర్రవీగిన చంద్రబాబు ప్రభుత్వ అహంకారాన్ని కలంతో ప్రజ లు నిలదీశారు. తమ ప్రాణాలకు విలువ లేదా.. ఆరోగ్యమంటే లెక్కలేదా..? అంటూ ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజా వైద్యానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని.. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేసిన కృషిని నేటి కార్పొరేట్ ప్రభుత్వం తుంగలోకి తొక్కుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించేందుకు చేస్తున్న యత్నాన్ని ప్రజలు గొంతెత్తి ప్రశ్నించారు. తమ పట్ల ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రను.. మోసాన్ని సహించలేని ప్రజలు ఆగ్రహోగ్రులయ్యారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని దించేసి అధికారం ఉంటే కచ్చితంగా దించేసేవారే... కానీ దానికింకా టైముంది.. అందుకే అందాకా సంతకాలతో తమ నిరసన తెలియజేశారు.
కోటి సంతకాల సేకరణకు
స్వచ్ఛంద ప్రజా మద్దతు
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెల్లుబికింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు గత ప్రభుత్వంలో నిర్ణయం తీసుకోగా.. అందులో 5 కాలేజీలు నిర్మాణం పూర్తి చేసుకుని తరగతులు ప్రారంభమయ్యాయి. మరో రెండు కాలేజీలు నిర్మాణాలు పూర్తి చేసుకోగా.. మిగిలిన 10 కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయాల్సిన కూటమి ప్రభుత్వం ఆర్థిక భారం పేరిట పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయటాన్ని బాధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి ఊరూ వాడా మద్దతు పలికింది. భవిష్యత్తు మీద ఆందోళనతో విద్యార్థి లోకం.. ఆరో గ్య భద్రతపై బెంగతో వృద్ధులు సైతం ఈ సంతకా ల్లో మేము సైతం అని పాల్గొన్నారు. మన్యం ప్రజ లు ఈ ఉద్యమానికి మోసులెత్తగా.. పట్టణ ప్రజలు పరుగులెత్తారు. పల్లెలు పట్టుగొమ్మలయ్యాయి.. విద్యార్థులు వీరులై కదలివచ్చారు. దీంతో మొత్తానికి విజయనగరం... పార్వతీపురం మన్యం జిల్లాల్లో కోటి సంతకాల ఉద్యమం ఘనంగా సాగింది. ఈ సంతకాల ప్రతులు ఇప్పుడు గ్రామాలూ.. మండలాలు.. పట్టణాలను దాటుకుని జిల్లా కేంద్రాలకు చేరుతున్నాయి. ఇవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకొని అక్కడి నుంచి గవర్నరుకు అందజేస్తారు. ప్రజా వ్యతిరేకతను గవర్నరుకు వివరించడం ద్వారా ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు.. దమననీతిని దేశవ్యాప్తం చేసేందుకు వైఎస్సార్‌సీపీ కంకణం కట్టుకుంది.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా
నియోజకవర్గాల వారిగా సేకరించిన
సంతకాల వివరాలు..
విజయనగరం : 54,889
ఎస్.కోట : 52,000
గజపతినగరం : 60,000
చీపురుపల్లి : 62,500
నెల్లిమర్ల : 67,019
బొబ్బిలి : 52,500
రాజాం : 51,000
పాలకొండ : 63,000
కురుపాం : 55,000
పార్వతీపురం : 64,000
సాలూరు : 35,000


