ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి
మాతృభాషను మరవద్దు..
పార్లమెంట్ సభ్యురాలు, ఇన్ఫోసిస్
ఫౌండర్ చైర్‌పర్సన్ సుధామూర్తి
రాజాం సిటీ: విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డవలప్ చేసుకోవడంతో పాటు ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని పార్లమెంట్ సభ్యురాలు, ఇన్ఫోసిస్ ఫౌండర్ చైర్‌పర్సన్, మూర్తి ట్రస్టు చైర్‌పర్సన్ సుధామూర్తి అన్నారు. స్థానిక జీఎంఆర్ ఐటీలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంగ్లంలో పట్టు సాధించడంతో పాటు మాతృభాషను చిన్నచూపు చూడకూడదన్నారు. మాతృభాష, ఆంగ్లభాష శ్రీకృష్ణుడికి ఇద్దరు తల్లులైన దేవకి, యశోదలు వంటివన్నారు. ఆ రెండు భాషలు మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు. లక్ష్య సాధనలో మనసులను ఇతర ప్రభావాల నుంచి దూరం చేయడానికి నిరంతర కృషి, సాధన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఉద్బోధించారు. విద్య, వైద్య రంగాలతో పాటు గ్రామీణాభివృద్ధి రంగాల్లో జీఎంఆర్ చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ వారిని ఉత్తేజపరిచారు. అనంతరం జీఎంఆర్ కేర్, నైరెడ్‌లను సందర్శించారు. 19 మంది గిఫ్టెడ్ చిల్డ్రన్స్‌కు స్కూల్ బ్యాగులను అందించారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన 10 మంది విద్యార్థులను సత్కరించారు. అంతకుముందు జీఎంఆర్ గ్రూపు సంస్థల చైర్మన్ గ్రంథి మల్లిఖార్జునరావు మాట్లాడుతూ సంఘ సంస్కర్తగా, విద్యావేత్తగా రచయితగా పేరుగాంచిన సుధామూర్తి ఎంతో మందికి ఆదర్శమని కొనియాడారు. కార్యక్రమంలో జీఎంఆర్ గ్రూపు చైర్మన్లు బీవీ నాగేశ్వరరావు, జీబీఎస్ రాజు, బొమ్మిడాల రమాదేవి, గ్రంథి పెదబాబు, పీడీకే రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్, ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


