అన్నదాతలో తుఫాన్‌ వణుకు | - | Sakshi
Sakshi News home page

అన్నదాతలో తుఫాన్‌ వణుకు

Oct 28 2025 8:12 AM | Updated on Oct 28 2025 8:12 AM

అన్నద

అన్నదాతలో తుఫాన్‌ వణుకు

కొనుగోలు కేంద్రాలు లేక.. సాగునీటి ప్రాజెక్టుల వద్ద అలెర్ట్‌

పంటంతా రోడ్డుపైనే...

మోంథా.. రైతుల్లో కలవరింత

పంట చేతికి అందొస్తున్న సమయంలో నేలపాలు

పంట చేతికివచ్చినా కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కవిటిభద్ర, లచ్చందొరవలస గ్రామాల మధ్య నూర్పుల పూర్తయ్యిన ధాన్యాన్ని, మొక్కజొన్న గింజలను రైతులు రహదారి పక్కనే పోగువేసి టార్పాలిన్లతో కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. నీరు చేరిపోతోంది. దీంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్న కేంద్రాలు తెరవాలని ఎప్పటి నుంచో రైతాంగం కోరుతున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలపై అధికారులు ఇంకా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.

సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్‌:

మోంథా పెను తుపాను రైతులను కలవరపెడుతోంది. ఖరీఫ్‌ పంట చేతికొస్తున్న సమయంలో గాలులు, వర్షాలు వెన్నులో వణుకు పట్టిస్తున్నాయి. తుపాను ప్రభావంతో ఇప్పటికే జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి అడపాదడపా గాలులు తోడవ్వడంతో కోత దశకు వచ్చిన వరి నేల వాలుతోంది. పొలాల్లో నీరు చేరడం.. కంకులు నీటిలోనే ఉండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటను కాపాడుకునేందుకు కల్లాల వద్దకు పరుగులు తీస్తున్నారు. కొన్నిచోట్ల యంత్రాలతో హడావిడిగా నూర్పులు పూర్తి చేసి.. టార్పాలిన్లు కప్పి, భద్రపరుస్తున్నారు. జిల్లాలో సుమారు 1.76 లక్షల ఎకరాల్లో వరి సాగులో ఉంది. దీంతోపాటు మొక్కజొన్న 15 వేల ఎకరాలు, పత్తి 14 వేల ఎకరాలు, అరటి ఐదు వేల ఎకరాల్లో సాగవుతోంది. మరో వెయ్యి ఎకరాల్లో కూరగాయల పంటలున్నాయి. పత్తి, మొక్కజొన్న కోత దశలో ఉంది. కొనుగోలు కేంద్రాలు తెరవాలని చాలా రోజులుగా అధికారులను రైతులు కోరుతున్నారు. నేటికీ నామమాత్రంగానైనా ప్రారంభించిన దాఖలాలు లేవు. దీంతో కోత పూర్తయిన పత్తి, మొక్కజొన్న గింజలను రోడ్డుపైనే ఆరబోసి ఉంచారు. తుపాను ప్రభావంతో వర్షాలు కురవడంతో టార్పాలిన్లతో కప్పుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ దశలో పత్తి తడిస్తే ఎందుకూ పనికి రాకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వరి కోతలు ప్రారంభమయ్యాయి. కొనుగోలు కేంద్రాలు లేక కల్లాల్లోనూ, రహదారి పక్కనే ఉంచుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో పది, పదిహేను రోజుల్లో కోతకు వచ్చే దశలో వరి ఉంది. ఇప్పుడు గాలులు, వర్షానికి పొలంలో నీరు చేరుతోంది. పంట నేలవాలుతోంది. దీంతో గింజ ముదరదని.. కవ్వ(పొల్లు)గా మారే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి ఎకరాకు రూ.25 వేల వరకు మదుపు పెట్టారు. అంతా సవ్యంగా సాగితే ఎకరాకు 25 నుంచి 30 బస్తాల వరకు దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. ఇప్పుడు తుపాను ప్రభావం వల్ల దిగుబడి సగానికి తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గరుగుబిల్లి: మోంథా తుఫాన్‌ వర్షాలతో జిల్లాలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులు పర్యవేక్షిస్తున్న అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు గేట్లు ఎత్తివేసి సాగునీటిని కిందకు విడిచిపెడుతున్నారు. తోటపల్లి ప్రాజెక్టు వద్ద నాగావళి నది నీటి ప్రవాహం నిలకడగా ఉంది. స్పిల్‌వేవద్ద 105 మీటర్లకు 103.22 మీటర్ల నీటి మట్టం నమోదైంది. ఒడిశాలో వర్షాలు కురిస్తే మరింత వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తుఫాన్‌ కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తోటపల్లి ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ నుంచి సాగునీటి సరఫరాను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. తుఫాన్‌ పరిస్థితిని ఇరిగేషన్‌ అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

సాలూరు రూరల్‌: మొక్కజొన్న రైతుల గడ్డు పరిస్థితికి ఈ చిత్రమే సజీవ సాక్ష్యం. పంట కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో చేతికొచ్చిన పంటను రైతులు అమ్ముకోలేకపోయారు. తుఫాన్‌ వర్షాలు కురుస్తుండడంతో ఇదిగో ఇలా మామిడిపల్లి వద్ద రోడ్డుపైనే మొక్కజొన్న గింజలను రాసులుగా ఉంచి టార్పాలిన్లతో కప్పారు.

అన్నదాతలో తుఫాన్‌ వణుకు 1
1/3

అన్నదాతలో తుఫాన్‌ వణుకు

అన్నదాతలో తుఫాన్‌ వణుకు 2
2/3

అన్నదాతలో తుఫాన్‌ వణుకు

అన్నదాతలో తుఫాన్‌ వణుకు 3
3/3

అన్నదాతలో తుఫాన్‌ వణుకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement