యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలి
● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి
పార్వతీపురం రూరల్: మోంథా తుఫాన్ ముప్పు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని, ఎటువంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా చూడడమే ఏకై క లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి, జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్వో కె.హేమలత, సబ్‌కలెక్టర్ ఆర్.వైశాలి తదితర ఉన్నతాధికారులతో కలిసి సోమవారం అత్యవసర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుఫాన్‌పై ప్రజలను చైతన్యపరచి లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారిని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. రహదారులపై చెట్లు కూలితే వెంటనే తొలగించేందుకు జేసీబీలను సిద్ధం చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని, జనరేటర్లు సిద్ధం చేసుకోవాలని విద్యుత్‌శాఖకు సూచించారు. పరిశుభ్రమైన తాగునీటి సరఫరాకు ఆటంకం రాకూడదన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో పర్యవేక్షణకు, నష్టం అంచనాకు డ్రోన్లను వినియోగించాలని పోలీస్ శాఖకు సూచించారు. నిండు గర్భిణులను సమీప పీహెచ్‌సీలకు తరలించాలని, అంబులెన్స్‌లు తదితర అత్యవరసర వాహనాలను సిద్ధంగా ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించారు. అత్యవసర సేవలకు ఎక్కడా ఆటంకం కలగరాదని స్పష్టంచేశారు.


