ఇంగ్లిష్‌లోనే వినతులు అందజేయాలి
● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర
సాలూరు: ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలపై విచారణ కోసం ఢిల్లీ నుంచి జిల్లాకు వచ్చే జాతీయమానవహక్కుల కమిషన్ బృందం సభ్యులు యతిప్రకాష్ శర్మ, సంజయ్‌కుమార్‌కు గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులు ఇంగ్లిష్‌లో వినతి పత్రాలు అందజేయాలని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీసీఎం పీడిక రాజన్నదొర తెలిపారు. పట్టణంలోని తన గృహంలో స్థానిక విలేకర్లతో సోమవారం మాట్లాడారు. పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు మృతిచెందుతున్నారని, దీనిపై రాష్ట్రప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదన్న విషయాన్ని ఢిల్లీలో ఉన్న జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఇటీవల ఫిర్యాదుచేశామన్నారు. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేసేసమయానికి 11 మంది విద్యార్థులు చనిపోయారని, తరువాత మరో నలుగురు విద్యార్థులు కీర్తన, పల్లవి, చిన్నారి, కవిత మృతి చెందారన్నారు. విద్యార్థులు చనిపోతుంటే ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకోకుండా, తగు విచారణ లేకుండా వాస్తవాలు నిగ్గుతేలకుండా పాఠశాలల హెచ్‌ఎంలు, వార్డెన్లను సస్పెండ్ చేయడం బాధాకరమన్నారు. ఢిల్లీ బృందం సాలూరు నియోజకవర్గంలో పర్యటిస్తే గిరిజన విద్యార్థుల సమస్యలను విన్నవిస్తానని చెప్పారు.
తుఫాన్‌తో జాగ్రత్త
మోంథా తుఫాన్‌పై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజన్నదొర సూచించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు అండగా నిలవాలని కోరారు.


