శిథిల భవనాలు.. అధ్వానంగా ఉన్న పరిసరాలు.. నేలపైనే భోజనాల
సమస్యల ‘వసతి’లో..
చదువుల పోరాటం!
మక్కువ/సాలూరు రూరల్:
తినేందుకు భోజనశాల ఉండదు.. ఎండైనా వానైనా ఆరుబయట, వరండాల్లో భోజనం చేయాల్సిందే. అనారోగ్యానికి గురైతే అందుబాటులో ఏఎన్‌ఎం ఉండరు. ప్రాథమిక వైద్యం కోసం కూడా ఆస్పత్రులకు పరుగుతీయాల్సిందే. దోమలు దాడిచేస్తున్నా హాస్టల్ కిటికీలు, డోర్లకు మెస్‌లు కానరావు. మెస్‌లు ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకునేవారు ఉండరు. దోమతెరలు పంపిణీ చేయరు. స్వచ్ఛమైన తాగునీరు అందడం గగనమే. కళ్లముందే ఆర్వోప్లాంట్ మూలకు చేరినా బాగుచేయరు. మరుగుదొడ్లు సరిపడక ప్రతిరోజు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోరు. వసతిగృహ పరిసరాలు అధ్వానంగా తయారైనా బాగుచేసేవారే ఉండరు. ఫలితం.. వసతిగృహ విద్యార్థులు సమస్యల నడుమ చదువులు సాగిస్తున్నారు. బంగారు భవిత కోసం తల్లిదండ్రులను విడిచి సుదూర ప్రాంతాల్లోని వసతిగృహాల్లో చేరి అనారోగ్యం పాలవుతున్నారు. మరికొందరు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇటీవల కాలంలో వరుసగా విద్యార్థులు మరణిస్తున్నా ఆశ్రమ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించేందుకు చర్యలు కానరావడం లేదని గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.
అరకొర మంచాలు.. నేలపైనే నిద్ర..
మక్కువ మండలంలోని పనసబద్ర పంచాయతీ ఎర్రసామంతవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 350 మంది గిరిజన విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. వీరికి సరిపడా మంచాలు, పరుపులు లేవు. చాలామంది విద్యార్థులు నేలపైనే నిద్రపోవాల్సిన పరిస్థితి. డైనింగ్ హాల్‌లేక నేలపైనే భోజనాలు చేస్తున్నారు. వసతిగృహంలో కనీస సదుపాయాలు లేవంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరుగుదొడ్లకు తలపులు లేకపోయినా పట్టించుకునేవారే కరువయ్యారని వాపోతున్నారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా ఇబ్బందులు తప్పడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉన్నతాధికారులు, మంత్రి సంధ్యారాణి స్పందించి వసతిగృహానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నవిస్తున్నారు.
అన్ని పనులూ విద్యార్థులే...
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రాతినిథ్యం వహిస్తున్న సాలూరు నియోజకవర్గంలోని గిరిజన బాలబాలికల ఆశ్రమ పాఠశాలలు సమస్యలతో సతమతమవుతున్నాయి. సాలూరు మండలంలో ఆరు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కూడా మౌలిక వసతుల సమస్య ఉంది.
● తోణాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో 400 మందికి పైబడి విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ డైనింగ్ హాల్ లేదు. పాడుబడిన భవనంలోనే వీరు భోజనాలు చేస్తున్నారు. మావుడి ఆశ్రమ పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి. నిత్యం ఇక్కడి పాఠశాల విద్యార్థులే తమకు తాము వడ్డించుకోవడం పరిపాటిగా మారింది. ఆరుబయట చెట్ల కింద భోజనాలు చేయాల్సిన దుస్థితి. అంటివల ఆశ్రమ పాఠశాలలోనూ సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కొత్తవలస బాలికల ఆశ్రమ పాఠశాలలో 660 మంది పిల్లలు ఉన్నారు. ఈ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పాఠశాలకు గత ప్రభుత్వం డైనింగ్ హాల్ మంజూరు చేసింది. నిర్మాణం పూర్తికాకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు.
● మామిడిపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరీ విచిత్రమైన పరిస్థితి. ఇక్కడ 180 మంది బాలికలు చదువుతున్నారు. రేకులు షెడ్డులోనే పిల్లలు చదువుకోవడంతో పాటు రాత్రిపూట డార్మె టరీగా వినియోగిస్తున్నారు. ఇక్కడ కూడా మరుగుదొడ్లు సరిపడినన్ని లేకపోవడంతో బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల సువర్ణముఖి నది ఒడ్డున ఉండడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
మావుడి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులే వడ్డన
తోణాం ఆశ్రమ పాఠశాలలో శిథిల భవనంలో
భోజనాలు చేస్తున్న విద్యార్థులు
వసతిగృహాల్లో సమస్యల కొలువు
నేలపైనే భోజనాలు
మరమ్మతులకు నోచుకోని మరుగుదొడ్లు
మూలకు చేరిన ఆర్వోప్లాంట్లు
సమస్యలతో సతమతమవుతున్న ఆశ్రమపాఠశాలల విద్యార్థులు
శిథిల భవనాలు.. అధ్వానంగా ఉన్న పరిసరాలు.. నేలపైనే భోజనాల
శిథిల భవనాలు.. అధ్వానంగా ఉన్న పరిసరాలు.. నేలపైనే భోజనాల
శిథిల భవనాలు.. అధ్వానంగా ఉన్న పరిసరాలు.. నేలపైనే భోజనాల


