
‘వైద్యవిద్య’ ప్రైవేటీకరణపై సమర శంఖం
● మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు
పార్వతీపురం రూరల్: ప్రభుత్వ వైద్య విద్యను పేదలకు దూరం చేసే కుట్రలను ప్రజల మద్దతుతో కూటమి ప్రభుత్వ దుర్మార్గమైన చర్యను ఎండగడుతూ అడ్డుకుంటామని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు స్పష్టం చేశారు. జిల్లాలో రూ.600 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్యకళాశాల భవనాలను ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచనను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించినట్లు జోగారావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో 50వేల సంతకాల సేకరణ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం మండలంలోని గోపాలపురం, అడ్డాపుశీల గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జోగారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్ హామీలను అరకొరగా కూడా అమలు చేయక ప్రజలను మోసం చేస్తుందని ప్రజావ్యతిరేక విధానాలతో వారి బతుకులతో చెలగాటం అడుతోందని తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వ దుష్ట ఆలోచన మారేలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయకుండా అడ్డుకునేందుకు ఈ ఉద్యమాన్ని చేపట్టామని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ పరిశీలకుడు మావుడి శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలమని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు.
ఉద్యమ పోస్టర్ విడుదల
ఈ కార్యక్రమానికి ముందుగా మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు తన క్యాంపు కార్యాలయంలో పార్వతీపురం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో కలసి మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమ పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోల సత్యనారాయణ, అధికార ప్రతినిధి మువ్వల సత్యంనాయుడు, ఎస్సీసెల్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మి రమేష్, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ, పలు విభాగాల ప్రధాన కార్యదర్శులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

‘వైద్యవిద్య’ ప్రైవేటీకరణపై సమర శంఖం