పార్వతీపురం రూరల్: ఆస్తి కోసం వ్యక్తి రాక్షసుడిలా మారాడు. ప్రాణాలు కాపాడాల్సిన 108 అంబులెన్స్ డ్రైవరే, కన్నతల్లిలా ఆదరించిన తన భార్య మేనత్తపై సుత్తితో దాడి చేసి హతమార్చబోయాడు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల కొత్తవలసలోని మొండి వీధిలో శుక్రవారం మధ్యాహ్నం ఈ అమానుషం జరిగింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..కొత్తవలసకు చెందిన రంకిరెడ్డి రాధకు జియ్యమ్మవలస మండలానికి చెందిన శ్రీనివాసరావుతో 2004లో వివాహమైంది. ఇల్ల రికం వచ్చిన శ్రీనివాసరావు, ఇటీవల అత్తింటి ఆస్తిని తన పేరిట రాయాలని భార్యను తీవ్రంగా వేధించసాగాడు. అతని వేధింపులపై గత జూన్‌న్‌లో రాధ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పటి నుంచి వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం భార్య రాధ ఇంట్లో లేని సమయం చూసి నిందితుడు శ్రీనివాసరావు సుత్తితో సహా అక్కడికి చేరుకున్నాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్య మేనత్త ఆర్. అన్నపూర్ణపై విరుచుకుపడి, ఆమెను తాళ్లతో కట్టేసి సుత్తితో భుజాలపై పాశవికంగా కొట్టాడు. అదే సమయానికి ఇంటికి వచ్చిన రాధ ఈ ఘోరాన్ని చూసి కేకలు వేయగా, ఆమెను ఓ గదిలో బంధించాడు. వారి అరుపులు విన్న స్థానికులు పరుగున రావడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తాళ్లతో ఊపిరి ఆడని స్థితిలో గాయాలపాలైన అన్నపూర్ణను కట్లు విప్పి పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, వివరాలు సేకరించినట్లు పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రి అవుట్‌పోస్ట్ పోలీసులు తెలిపారు.