రంగస్థల ప్రముఖులకు అవార్డుల ప్రదానం | - | Sakshi
Sakshi News home page

రంగస్థల ప్రముఖులకు అవార్డుల ప్రదానం

May 4 2026 7:19 AM | Updated on May 4 2026 7:19 AM

రంగస్థల ప్రముఖులకు అవార్డుల ప్రదానం

తెనాలి: కొలంకపురి నాటక కళాపరిషత్‌, శ్రీసాయి ఆర్ట్స్‌, కొలకలూరు సంయుక్త నిర్వహణలో ఉభయ రాష్ట్రస్థాయి 12వ ఆహ్వాన నాటికల పోటీలు రెండోరోజైన ఆదివారం రాత్రి కొనసాగాయి. కొలకలూరు గ్రామపంచాయతీ పరిధిలోని ఖాజీపేట నాటకశాల వద్ద ప్రత్యేక వేదికపై జరుగుతున్న ఈ నాటిక పోటీలు గడ్డం ప్రకాష్‌ జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రంగస్థల, టీవీ, సినీనటులు డాక్టర్‌ గోవాడ వెంకట్‌కు కరణం సురేష్‌ జ్ఞాపకార్థం ‘సవ్యసాచి’ అవార్డును ప్రదానం చేసి సత్కరించారు. విజయనగరానికి చెందిన ప్రముఖ రంగస్థల నటి ఎస్‌.జ్యోతిరాణికి గోపరాజు హేమలత జీవిత సాఫల్య పురస్కారాన్ని గోపరాజు శివరామకృష్ణ హనుమత్‌ శేఖర్‌, కుటుంబసభ్యులు ప్రదానం చేశారు. సభకు ఆంధ్రప్రదేశ్‌ నాటక అకాడమీ మాజీ కార్యదర్శి డాక్టర్‌ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షత వహించారు. కళారంగ ప్రముఖులు డాక్టర్‌ ముత్తవరపు సురేష్‌బాబు (చిలకలూరిపేట), గుదె పాండురంగారావు (అనంతపురం), కూచి రామాంజనేయులు (వినుకొండ), ఏటూరి రోహిణీకుమార్‌ (హైదరాబాద్‌), చెరుకూరి సాంబశివరావు (గుంటూరు) పాల్గొన్నారు. కళారంగంలో కొలంకపురి నాటక కళాపరిషత్‌, శ్రీసాయి ఆర్ట్స్‌, కొలకలూరు చేస్తున్న కృషిని ప్రశంసించారు. గోపరాజు రమణ, గోపరాజు విజయ్‌, వైఎస్‌కేఎన్‌ స్వామి, సుంకర శ్రీనివాసరావు, సుద్దపల్లి మురళీధర్‌ పర్యవేక్షించారు. నాటక పోటీల్లో భాగంగా తొలుత కళానికేతన్‌, వీరన్నపాలెం వారి ‘దీపం కింద చీకటి’ నాటికను ప్రదర్శించారు. అగస్త్య రచనకు వైబీ చౌదరి దర్శకత్వం వహించారు. తదుపరి హేలాపురి కల్చరల్‌ అసోసియేషన్‌–ఏలూరు వారి ‘అనగనగా ఓ రాత్రి’ నాటికను ప్రదర్శించారు. పీవీ సత్యనారాయణ రచనకు మహమ్మద్‌ ఖాజావలి దర్శకత్వం వహించారు. చివరగా ఎస్‌ఎంఆర్‌ క్రియేషన్స్‌–అనకాపల్లి వారి ‘మలిసంధ్య’ నాటికను ప్రదర్శించారు. గోవిందరాజుల నాగేశ్వరరావు రచనకు ముత్యాలరావు దర్శకత్వం వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement