ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు అతివేగమే ప్రమాదానికి కారణం
పిడుగురాళ్ల: మున్సిపల్ ట్రాక్టర్‌ను వెనుక నుంచి కారు ఢీకొనటంతో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలైన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలోని బైపాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నరసరావుపేటకు చెందిన ఓ కుటుంబం కారులో తెలంగాణ రాష్ట్రంలోని జానపాడు దర్గా దర్గకు వెళ్తున్నారు. ఈక్రమంలో కొండమోడు డంపింగ్ యార్డులో చెత్తను వేసి పిడుగురాళ్లలోని ఓటర్ ట్యాంక్ వద్ద పార్క్ చేసేందుకు వస్తున్న ట్రాక్టర్‌ను పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి దగ్గరలో కారు వెనుకగా ఢీకొనడంతో కారు గాలిలో పల్టీలు కొట్టి కింద పడింది. ఘటనలో ఇమామ్ హుస్సేన్ (38) అక్కడిక్కడే మృతి చెందగా కరిముల్లా, షకీరా, నజీమా, నూర్జహాన్, హసీమా, జానీలకు గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు, ఎస్‌ఐ శివనాగరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. క్షతగాత్రులను పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం నరసరావుపేటకు తరలించారు. సీఐ శ్రీరాం వెంకట్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


