నరసరావుపేట టౌన్: ఖైదీలకు అందించే ఆహార పదార్థాల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఏ. సలోమి అన్నారు. 13వ అదనపు జిల్లా కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి ఆర్. శరత్‌బాబు ఆదేశాల మేరకు గురువారం సబ్‌జైలును ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆహార నాణ్యతను పరిశీలించారు. వంట గదిని పరిశుభ్రంగా ఉంచాలని జైలు అధికారులను ఆదేశించారు. అనంతరం నిర్వహించిన సమావేశాన్ని ఉద్ధేశించి ఆమె మాట్లాడారు. ఖైదీలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఉచిత న్యాయ సహాయం పొందే విధివిధానాల గురించి వివరించారు. న్యాయవాదిని ఏర్పాటు చేసుకునే స్థోమత లేని నిరుపేదలు మండల న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయిస్తే ఉచిత న్యాయ సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సబ్‌జైలర్ సురభి అంజయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
పిడుగురాళ్ల: గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి గురువారం పిడుగురాళ్ల పట్టణ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు స్వాగతం పలికారు. అనంతరం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం ఫైల్స్‌కు సంబంధించిన వివరాలు పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ రెగ్యులర్ తనిఖీలలో భాగంగా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్‌కు రావటం జరిగిందని తెలిపారు. కొన్ని రికార్డులు పరిశీలించామని, మిగిలినవి కూడా పరిశీలిస్తామని వాటిల్లో ఏమైనా అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో గురజాల డీఎస్పీ, పిడుగురాళ్ల సీఐ, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అచ్చంపేట: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. అంబడిపూడి, కోగంటివారిపాలెం, కొండూరు గ్రామాల వీఆర్వో షేక్ ఇబ్రహం రోజు మాదిరిగానే కార్యాలయానికి వచ్చి స్టాఫ్ రూములో కూర్చున్నారు. అతని నుంచి పురుగుమందు వాసన రావడాన్ని గమనించిన తోటి వీఆర్వోలు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మెరుగైన వైద్యం నిమిత్తం హుటాహుటిన సత్తెనపల్లికి తరలించారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మందు తాగి ఉండవచ్చని సిబ్బంది భావిస్తున్నారు. ఎవరి ఒత్తిడి వల్లనైనా మందు తాగాడే, ఇంటి వద్దే తాగి వచ్చాడా, ఆఫీసుకు వచ్చి తాగాడే అనే విషయాలు తెలియాల్సి ఉంది. అసలు విషయాన్ని మాత్రం తహసీల్దారు సిబ్బంది బయటకు పొక్కనీయకుండా గోప్యంగా ఉంచారు. మందు తాగిన వీఆర్వో ఇబ్రహం స్వగ్రామం క్రోసూరు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 527.20 అడుగులకు చేరింది. ఇది 152.7328 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎడమకాలువకు 2,405, ఎస్‌ఎల్‌బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 4,205 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 4,205 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.


