చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

చర్యలు తీసుకోండి

Apr 17 2026 11:08 AM | Updated on Apr 17 2026 11:08 AM

వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా

నరసరావుపేట: రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఇసుక కొరత లేకుండా చూసేందుకు, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు జిల్లాలో రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుకను నిల్వ ఉంచేలా పక్కా కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఎస్పీ బి.కృష్ణారావు, జాయింట్‌ కలెక్టర్‌ సంజనా సింహతో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ (డీఎల్‌ఎస్‌సీ) సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక లభ్యత, నిల్వలు, నూతన రీచ్‌ల ఏర్పాటుపై సమీక్ష చేశారు. ఇప్పటికే అనుమతులు పొందిన సెమీ–మెకనైజ్డ్‌ ఇసుక రీచులు, సాధారణ రీచ్‌ల ద్వారా పారదర్శకంగా ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. జిల్లాలో భవిష్యత్తు ఇసుక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కొత్తగా ఇసుక లభ్యత ఉన్న ప్రాంతాలను గుర్తించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ముఖ్యంగా అచ్చంపేట, అమరావతి మండలాల్లో కొత్త రీచ్‌ల ఏర్పాటుకు సంబంధించి సమగ్ర నివేదికలు పంపాలని ఆయా మండలాల తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా మైనింగ్‌ అధికారి నాగయ్య పాల్గొన్నారు.

పర్యాటక అభివృద్ధికి సమన్వయంతో పనిచేయండి

జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో వేగంగా పనులు పూర్తి చేసి పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానిక ఉపాధి అవకాశాలను పెంపొందించాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా పర్యాటక అభివృద్ధి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌–శానిటరీ కాంప్లెక్సుల నిర్మాణ స్థితి, వినియోగంపై సమీక్షించారు. పర్యాటక ప్రదేశాలను జాతీయ స్థాయిలో ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఆర్డీవో బాలకృష్ణ, డీఆర్‌డీఏ పీడీ ఝాన్సీరాణి, మెప్మా పీడీ గోపాలకృష్ణ, జిల్లా పర్యాటక శాఖ అధికారి నాయుడమ్మ, ఏపీటీడీసీ డీవీఎం చైతన్య, డీఇ కుమార్‌, పర్యాటక అభివృద్ధి మండలి మెంబర్‌ జాస్తి వీరాంజనేయులు, అమరావతి తహసీల్దార్‌ డానియల్‌, ఎంపీడీఓ శివపార్వతి, కోటప్పకొండ ఈఓ చంద్రశేఖర్‌, కలెక్టరేట్‌ ల్యాండ్‌ మ్యాటర్‌ సూపరింటెండెంట్‌ సంజీవకుమారి, ఆర్కియాలజీ సిబ్బంది పాల్గొన్నారు.

నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత

జిలాల్లో నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా పేర్కొన్నారు. నీటి భద్రత– సాగునీటి సంఘాల బాధ్యత’లో గ్రామాలలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనలపై గురువారం కలెక్టరేట్‌ నుంచి అధికారులతో టెలీకాన్ఫెరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జిల్లాలో అమలు జరుగుతున్న ’జలధార’ కార్యక్రమం రీతిలో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు గ్రామాలలో నీటి వనరులలో మిగులు, లోటు నీటి నిల్వలపై చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనల గురించి ఇరిగేషన్‌ శాఖ ఇంజనీరింగ్‌ అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు లేకుండా ఉండేలా నీటి పరిరక్షణ కోసం ‘నీటి భద్రత– సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, అమలులో అధికారులు సమర్థంగా పని చేయాలని ఆదేశించారు.

జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్‌, ఎస్పీ

Advertisement
 
Advertisement
Advertisement