మాజీ మంత్రి విడదల రజిని
చిలకలూరిపేట: ఓటరు జాబితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ మంత్రి విడదల రజిని చెప్పారు. పట్టణంలోని ఎన్‌ఆర్‌టీ రోడ్డులో ఉన్న మాజీ మంత్రి నివాస ప్రాంగణంలో వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ కన్వీనర్లు, పార్టీ ముఖ్య నాయకుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రారంభం కాబోతోందని, అత్యంత కీలకమైన ఈ వ్యవహారంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమగ్ర పారదర్శక ఓటరు జాబితాల రూపకల్పన కోసం అంటూ తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో లక్షల ఓట్లు తీసివేయడం జరిగిందన్నారు. ఇప్పుడు ఎస్‌ఐఆర్‌కు అందరూ సిద్ధంగా ఉండాలని, గ్రామాల్లో సమావేశాలు పెట్టుకొని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చర్చించాలన్నారు. ప్రతి బూత్‌కు క్రీయాశీలంగా ఉన్న వారిని ఎంపిక చేయాలని సూచించారు. వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగించేందుకు ప్రయత్నం చేసే అవకాశం ఉన్నందున, ఓటర్లను గుర్తించటం, మ్యాపింగ్ చేసుకోవడం వెంటనే జరగాలన్నారు. బీఎల్‌వోల ద్వారా మనకు తెలియకుండానే ఫామ్ 6, 7 తెచ్చి పెడతారని ఈ విషయంలో సాంకేతిక అవగాహన పెంచుకోవాలన్నారు.


