గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ విద్యారంగంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 19న విజయవాడలోని అమరావతి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర సదస్సు పోస్టర్లు ఆవిష్కరించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులలో 50 శాతానికి పైగా మహిళలు ఉన్నారని, బాల, బాలికలకు నాణ్యమైన నైపుణ్యమైన విద్య బోధించడానికి శక్తివంచన లేకుండా వారు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో అనారోగ్యానికి గురైతే ప్రత్యేక రెస్ట్ రూములు లేకపోవటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో మహిళలు మహిళా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల సేకరణకు ఇప్పటికే ప్రయత్నం చేశామని తెలిపారు. సమస్యలన్నింటిని రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో పాటు, విద్యాశాఖ మంత్రికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. యూటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు రాజశేఖర్, ఎం.కళాధర్ మాట్లాడుతూ విజయవాడ కేంద్రంలో జరిగే రాష్ట్ర సదస్సు విజయవంతంలో గుంటూరు మహిళా ఉపాధ్యాయులు ఎక్కువ మంది పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల విభాగం చైర్మన్ ఎం.హనుమంతరావు, జిల్లా సహాధ్యక్షురాలు ఎండీ. షకీలా బేగం తదితరులు పాల్గొన్నారు
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
నక్కా వెంకటేశ్వర్లు


