సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చేతిలో ఆయుధంగా పోలీసు వ్యవస్థ మీడియా సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపాటు 18న గుంటూరు కలెక్టరేట్ వద్ద 12 గంటల నిరసన నిరాహార దీక్ష
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రజలను, లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ చేతిలో ఆయుధంగా మారిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రతిపక్షాలను వేధిస్తూ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుచేస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌ను ఆయన కార్యాలయంలో అంబటి రాంబాబు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అక్రమంగా, అన్యాయంగా తనను తప్పుడు కేసులో ఇరికించి 18 రోజులపాటు జైల్లో నిర్బంధించిందని గుర్తు చేశారు. ఆ సమయంలో జడ శ్రావణ్‌కుమార్ తన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. రాజమండ్రి జైల్లో ఉన్న తనను కలిసి పరామర్శించారన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన జడ శ్రావణ్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు ఆయన కార్యాలయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. శ్రావణ్‌కుమార్ తమ పార్టీ కాకపోయినప్పటికీ ఈ ప్రభుత్వం తన అరెస్టు విష యంలో అక్రమంగా వ్యవహరించిందని ప్రపంచానికి చాటారన్నారు. జడ శ్రావణ్ కుమార్ సమా జంలో జరిగే అన్యాయాలపై కంఠం వినిపిస్తున్నా రని, ఆయన మాటలు సమాజంపై ప్రభావం చూపుతున్నాయని వివరించారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని వైఎస్సార్ సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని మఫ్టీలో వచ్చిన పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారన్నారు. నోటీసులు ఇస్తే సరిపోయే కేసుల్లో సమాజంలో పేరుగడించిన వ్యక్తులను రౌడీల్లా, సంఘ విద్రోహ శక్తుల్లా ఎత్తుకు పోవడం సమంజసమేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించి వేధించే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని స్పష్టంచేశారు. పోలీసులు, ప్రభుత్వాలు ఉంది కక్ష తీర్చుకోవడానికి కాదని, ప్రజల సంక్షేమాన్ని చూసేందుకు పని చేయాలని హితవుపలికారు. ప్రభుత్వాలు కక్ష తీర్చుకునేందుకు పోలీసులు వాడుకునే నీచస్థాయికి దిగజారిపోయాయన్నారు.
గుంటూరులో నిరాహార దీక్షకు నిర్ణయం
ఈ నెల 18వ తేదీ ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన నిరాహార దీక్ష చేస్తున్నట్లు అంబటి రాంబాబు ప్రకటించారు. రెండు ప్రధాన డిమాండ్లతో 12 గంటల నిరసన నిరాహార దీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాను అరెస్టయినప్పటి నుంచి కోర్టులో ప్రవేశపెట్టే వరకు పోలీసులు ప్రవర్తించిన తీరు చట్టవ్యతిరేకమైందని స్పష్టంచేశారు. తనను హింసించాలని ప్రయత్నించిన ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసి విచారణ జరపాలని, తన ఇల్లు, కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపాలనే డిమాండ్లతో దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులకు కనువిప్పు కలగా లని తాను చేస్తున్న దీక్షకు ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పక్షాలు మద్దతు తెలపాలని అంబటి రాంబాబు కోరారు. జడ శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ పూడి శ్రీహరి అరెస్ట్‌ను ఖండించారు. ఇది మీడియాపై దాడిగా పరిగణించాల్సి ఉంటుందన్నారు.


