డైవర్షన్‌ పాలిటిక్స్‌ కోసమే అక్రమ అరెస్ట్‌లు | - | Sakshi
Sakshi News home page

డైవర్షన్‌ పాలిటిక్స్‌ కోసమే అక్రమ అరెస్ట్‌లు

Apr 16 2026 10:30 AM | Updated on Apr 16 2026 10:30 AM

తాడేపల్లిరూరల్‌: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వారి పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్రంలో ఏదైనా విషయంపై ప్రజలు చర్చించుకునే సమయంలో డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేసేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను అక్రమ అరెస్ట్‌ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీసెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు, రాష్ట్ర గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షులు అంకమరెడ్డి నారాయణమూర్తి అన్నారు. బుధవారం తాడేపల్లి పట్టణ పరిధిలో నవోదయ కాలనీలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మీడియా కార్యదర్శి పూడి శ్రీహరిని అక్రమంగా అరెస్ట్‌ చేసిన సంఘటనపై సంఘటనా స్థలం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర భవిష్యత్తు కోసం మావిగన్‌ ప్రతిపాదన తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలో ఉన్న పోర్టులను ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటన చేయడంతో దాన్ని డైవర్ట్‌ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి చీప్‌ ట్రిక్‌లు ఉపయోగిస్తున్నారన్నారు.

మారని పోలీసుల తీరు

పోలీసులను గౌరవ న్యాయస్థానం ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా అధికారంలో ఉన్న పార్టీ కోసం ఎనలేని కృషి చేస్తున్నారని, ఇలాంటి వారు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పూడి శ్రీహరిన బలవంతంగా కారు ఎక్కించుకుని తీసుకెళ్లారని, స్థానిక పోలీసులు మాకు ఏమీ తెలియదని మీడియా సాక్షిగా చెబుతున్నారని, అలా చెబుతూనే పూడి శ్రీహరి ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లేందుకు ప్రయత్నం చేశారన్నారు. లాయర్లు ప్రశ్నించడంతో చివరకు అక్కడ కూర్చుని నోటీసులు వ్రాసి అందజేశారని తెలిపారు. అరెస్ట్‌ విషయం తెలియనప్పుడు ఎందుకు సోదా చేస్తున్నారని ప్రశ్నించగా మొదట వచ్చిన ఎస్‌ఐకి బదులుగా మరో ఎస్‌ఐ వచ్చి సమాధానం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ నాయకులు సుదర్శనరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్‌), తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్‌, తాడేపల్లి పట్టణ ఎస్సీసెల్‌ అధ్యక్షులు చిలుకోటి మధు, జిల్లా బీసీ సెల్‌ నాయకులు బత్తుల దాసు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్‌

ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు

Advertisement
 
Advertisement
Advertisement