బైక్‌ను ఢీకొన్న కారు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న కారు

Apr 15 2026 7:50 AM | Updated on Apr 15 2026 7:50 AM

మూడేళ్ల చిన్నారి మృతి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన

మంగళగిరి టౌన్‌: మంగళగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు మంగళగిరికి చెందిన వాసంతి పెదకాకానిలో నివాసముంటోంది. వాసంతి దంపతులకు మూడు సంవత్సరాల చిన్నారి విరోనిక (3) ఉంది. వాసంతి డెలివరీ నిమిత్తం కొన్ని రోజుల కిందట విరోనికతో మంగళగిరిలోని పుట్టింటికి వచ్చింది. వాసంతి అన్నయ్య ప్రశాంత్‌ విరోనికను తీసుకుని మంగళవారం ఉదయం ద్విచక్రవాహనంపై గౌతమ బుద్ధ రోడ్డు వద్దకు వచ్చాడు. అదే సమయంలో అతివేగంగా వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై ఉన్న ప్రశాంత్‌, విరోనికలు కిందపడిపోయారు. ఇద్దరిపై నుంచి కారు వెళ్లడంతో విరోనికకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ప్రశాంత్‌ రెండు కాళ్లకు తీవ్రంగా దెబ్బలు తగలడంతో మంగళగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అదే కారు అక్కడే ఉన్న మరో ఇద్దరు మహిళలను ఢీకొనడంతో వారికి గాయాలయ్యాయి. స్థానికులు అడ్డుకుని కారు నడుపుతున్న సిబార్‌ డెంటల్‌ కాలేజీలో నాల్గవ సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థి సాయివాగ్ధేవిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ పోలీసులు కారు నడుపుతున్న వైద్య విద్యార్థినిని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. వైద్య విద్యార్థినిని బయటకు పంపించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం బస్టాండ్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు. దీంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement