అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారిన వైనం హైకోర్టు ఆదేశాలని పక్కన పెట్టి 41 నోటీసులు ఇచ్చే కేసుల్లో కూడా అరెస్టులు సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్‌లో కొల్లూరు పోలీసుల ఓవరాక్షన్ వైఎస్సార్ సీపీ కార్యకర్తను చావబాదిన చెరుకుపల్లి ఎస్‌ఐ గుంటూరు ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు ధర్నాలో కానిస్టేబుళ్ల అతి చిలకలూరిపేట న్యాయవాది హత్యలో కానిస్టేబుళ్లే నిందితులు వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడిన మాచర్ల ఏఎస్‌ఐ డబ్బులు తీసుకుని పరువు హత్యకు సహకరించిన మాచర్ల సీఐ ప్రశ్నార్ధకంగా మారుతున్న గుంటూరు రేంజ్ పోలీసుల చర్యలు ప్రతిపక్ష నేతలపై వేధింపులకు రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేసిన వారికే పోస్టింగ్
పరువు తీస్తున్న పల్నాడు పోలీసులు
కట్టుతప్పుతున్న రేంజ్ పోలీసులు
ప్రభుత్వ అవినీతి, అసమర్ధతను చూస్తూ తట్టుకోలేక సామాన్యుడు సామాజిక మాధ్యమంలో ఒక్క పోస్టు పెట్టడం ఆలస్యం.. పచ్చ పెద్దల హుకూంతో ఖాకీలు వచ్చి వాలిపోతారు. ఒక తీవ్రవాదిని పట్టుకుంటున్నాం అన్నంత ‘రేంజ్’లో అర్ధరాత్రిళ్లు, మఫ్టీల్లో ప్రైవేటు వాహనాల్లో ఇళ్లకు రావడాలు.. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపై దాడి చేయడాలు.. స్టేషన్ నుంచి స్టేషన్‌కు మారుస్తూ చిత్రహింసలు పెట్టడాలు.. తప్పుడు కేసులు బనాయించడాలు.. ఇవన్నీ ఇక్కడి పోలీసులకు షరా మామూలే. అధికారపార్టీ నేతలు విజయోత్సవ ర్యాలీలు, రోడ్లపై ఉత్సవాల పేరుతో నానా హంగామా చేసినా పట్టించుకోరు.. అదే ప్రతిపక్ష నేతలు చిన్న నిరసన వ్యక్తం చేసినా.. లాఠీలతో కుళ్ల బొడుస్తు.. తప్పుడు కేసులు నమోదు చేయడంలో ముందుంటారు. తమ దందాలకు అడ్డొస్తే వారు ఎంతటివారైనా, న్యాయవాదులైనా అడ్డు తొలగించుకోవడంలో ముందుంటారు. ప్రేమ వ్యవహారాల్లో తలదూర్చి ఆత్మహత్యలకు కారణమవుతారు.. ప్రేమికుల వ్యవహారాల్లో వీడియోలు తీసి లైంగిక వాంఛలు తీర్చుకుంటారు.. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో.. కాబట్టే ఇక్కడి పోలీసుల ‘రేంజ్’ వేరయా.. అని ఉమ్మడి జిల్లావాసులు చెప్పుకొంటున్నారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు రేంజ్‌లో పోలీసులు కట్టుతప్పుతున్నారా? వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలను పరిశీలిస్తే అది నిజమే అనిపిస్తోంది. కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ఖాకీ చొక్కాలు విప్పేసి పచ్చ చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా కేసుల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో 41 నోటీసులు ఇవ్వాలని చెప్పినా పోలీసులు తమ తీరు మార్చుకోవడం లేదు.
గోడ దూకి మరీ వెళ్లి..
తాజాగా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చినపులివర్రులో నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బాణాల తనీష్‌బాబు స్థానిక ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని సమర్ధిస్తూ మాట్లాడటంపై నిలదీస్తూ పోస్టు పెట్టారు. ఈ పోస్టులో ఎటువంటి అసభ్యకరమైన భాష వాడలేదు. అయినా తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు ఇచ్చారన్న పేరుతో అర్ధరాత్రి దాటిన తర్వాత మఫ్టీలో ప్రైవేటు వాహనంలో గోడలు దూకి వెళ్లి మరీ తనీష్‌బాబును అరెస్టు చేయడానికి పోలీసులు యత్నించిన తీరు తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఈ అక్రమ అరెస్టును అడ్డుకోబోయిన కుటుంబసభ్యులతో పాటు తనీష్‌పై కూడా పోలీసులు చేయి చేసుకోవడం, బలవంతంగా లాక్కెళ్లాలని చూడటంతో స్థానికులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అశోక్‌బాబు అక్కడికి చేరుకుని పోలీసులను నిలదీయడమే కాకుండా పోలీసులపై కేసు నమోదు అయ్యేలా చూశారు.
వైఎస్సార్ సీపీ శ్రేణులపై రెచ్చిపోయిన వైనం
రెండురోజుల క్రితం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గుంటూరు బ్రాడీపేటలోని ఆ పత్రిక నగర కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న వైఎస్సార్ సీపీ నేతలపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. లాలాపేట, పాతగుంటూరు, పట్టాభిపురానికి చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నతాధికారుల ముందే రెచ్చిపోయి వైఎస్సార్ సీపీ నేతలను, కార్యకర్తలను లాఠీలతో కుళ్లబొడిచారు.
ఇక పల్నాడు జిల్లాలో అయితే పోలీసులు పూర్తిగా అదుపుతప్పారు. రోజుకో ఆరోపణలతో పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు తెస్తున్నారు. పల్నాడు జిల్లాలో అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించిన ఒక సీఐను మహిళతో సహజీవనం చేసిన వ్యవహారంలో వీఆర్‌కు పంపారు. మాచర్లకు చెందిన చౌడేశ్వరి ప్రేమ వ్యవహారంలో తలదూర్చి ఆమె పరువు హత్యకు పరోక్షంగా సహకరించిన సీఐ సస్పెండ్ అయ్యారు. మాచర్లకే చెందిన ఓ ఏఎస్‌ఐ ప్రేమ జంటల్ని బెదిరించి వారి వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడమే కాకుండా లైంగికంగా వేధించిన కేసులో సస్పెండ్ అయ్యారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన న్యాయవాది హత్యకేసులో నరసరావుపేటకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్టు అయ్యారు. అక్రమ సంబంధం నేపథ్యంలో మరో కానిస్టేబుల్‌ను కలుపుకొని హత్యకు పాల్పడ్డారు. అధికార పార్టీతో సన్నిహితంగా ఉంటే ఏమైనా చేయవచ్చనే ధీమానే పోలీసులను తప్పుడు మార్గంలోకి నెడుతోంది.


