అర్జీలు సకాలంలో పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

అర్జీలు సకాలంలో పరిష్కరించండి

Apr 14 2026 7:40 AM | Updated on Apr 14 2026 7:40 AM

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా పీజీఆర్‌ఎస్‌లో 128 అర్జీలు స్వీకరణ

నరసరావుపేట రూరల్‌: పీజీఆర్‌ఎస్‌ అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ కృతిక శుక్లా, జేసీ సంజనా సింహతో పాటు ప్రభుత్వ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొని అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 128 అర్జీలు అధికారులకు అందాయి. కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌లో 20 అర్జీలు రాగా ఇందులో గురజాల డివిజన్‌కు సంబంధించినవి 6, సత్తెనపల్లి డివిజన్‌–6, నరసరావుపేట డివిజన్‌–8 అర్జీలు ఉన్నాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టితో పనిచేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌ గ్రీవెన్స్‌పై ఆడిట్‌ నిర్వహించాలని, అర్జీదారులతో మాట్లాడి పెండింగ్‌ ఆడిట్‌ పూర్తిచేయాలని తెలిపారు.

జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలని బీజేపీ కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు నారా శ్రీనివాస్‌రెడ్డి, నాసరయ్య, నాగేశ్వరరావులు కలెక్టర్‌ను కోరారు. జిల్లాలో 1.30లక్షల ఎకరాల్లో మొక్కజొన్నను రైతులు సాగు చేసారని తెలిపారు. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ.2400గా ఉండగా, వ్యాపారస్తులు రూ.1600 నుంచి 1800లకే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దీని వలన రైతులు ఎకరానికి రూ.20వేలు నష్టపోతున్నారని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement