నరసరావుపేట: మే నెల 15వ తేదీన సాగర్ నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన సాగునీటి కాలువల మరమ్మతులు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. సోమవారం సాయంత్రం తన కార్యాలయంలో అధికారులతో వేసవిపై సమీక్షించారు. నీరు విడుదల కాగానే రైతులు పంటలు సాగు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జలధార– జలహారతి పథకం ద్వారా జిల్లాలో సగటు భూగర్భ జల మట్టం ఆరు మీటర్లకు తీసుకురావాలని కోరారు. పది రోజుల్లోగా భూగర్భ జలం మట్టం పెంపుదలే లక్ష్యంగా కాలువల పూడిక తీత, చెరువుల అనుసంధానం, నీటి పథకాల మరమ్మతులు వంటి కార్యక్రమాలకు ప్రతిపాదనలు పంపి అనుమతులు పొందాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద నియోజకవర్గానికి రూ.2.5 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకు నిధులను జలధార–జలహారతి కార్యక్రమం కోసం వినియోగించాలన్నారు. సాగు, తాగునీటి చెరువులన్నీ అభివృద్ధి చేసుకోవాలన్నారు. నాణ్యమైన పరిశుభ్రత జలాలను ప్రజలకు సరఫరా చేయాలని కోరారు. చెరువు కట్టలు, పంట కాల్వల కట్టలన్నీ బలోపేతం చేయాలని చెప్పారు. జలాల సంరక్షణలో భాగంగా 100 రోజుల కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాలో ఉన్న చెరువులు, వాటి కట్టల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు.
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా


