నరసరావుపేట: ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు అడ్మిషన్ల పేరుతో టీచర్లపై తీవ్ర ఒత్తిడి పెడుతున్నాయని డెమెక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డీవైఎఫ్‌ఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.ఆంజనేయరాజు సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రైవేటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఈ ఒత్తిడిని అరికట్టడంలో విద్యాశాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం జూన్‌న్‌లో మాత్రమే అడ్మిషన్లు ప్రారంభించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా కొన్ని పాఠశాలలు డిసెంబర్ నుంచే ముందస్తు అడ్మిషన్లు చేపట్టి నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని వివరించారు. ప్రతి రోజు స్కూల్ ముగిసిన తర్వాత టీచర్లను ఇంటింటికీ పంపిస్తూ అడ్మిషన్ల కోసం ప్రచారం చేయిస్తున్నారని, వారికి టార్గెట్లు విధించి ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. టార్గెట్లు పూర్తి చేయకపోతే జీతాలు నిలిపివేయడం, ఉద్యోగం తీసేస్తామని బెదిరించడం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా విద్యా శాఖ అధికారులు దృష్టి సారించి ముందస్తు అడ్మిషన్లు నిలిపివేయాలని, టీచర్లపై వేధింపులు ఆపేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. సెలవు రోజుల్లో కూడా పూర్తి జీతభత్యాలు చెల్లించాలనే నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
డీవైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయరాజు


