ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. రెండో శనివారం, ఆదివారం వరస సెలవుల నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శాంతి కల్యాణంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఇంద్రకీలాద్రికి విచ్చేసిన భక్తులు ఘాట్‌రోడ్డు, మహా మండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా ఆలయానికి చేరుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచే అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1–30 గంటల వరకు అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసి బంగారు వాకిలి దర్శనం కల్పించారు. రూ.300 టికెట్‌పై కూడా ఈ దర్శనం లభించింది.


