గురజాల: తన నియోజకవర్గానికి చెందిన ఇద్దరు బీసీ యువకులు హత్యకు గురైతే.. వారి కుటుంబ సభ్యులను కనీసం పరామర్శించకుండా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చర్లగుడిపాడు గ్రామానికి చెందిన కాకుమాను భావనాబుషీ, భువనగిరి శ్రీనివాసరావులను ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు అతి కిరాతంగా చంపి కాలువలో పడవేసిన సంఘటన తెలిసిందే. వారి కుటుంబాలను శనివారం మాజీ ఎమ్మెల్యే కాసు పరామర్శించి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ నాయకులు చంపి కాలువలో పడవేస్తే స్టేషన్‌లో కనీసం పట్టించుకోలేదన్నారు. వారి మృతదేహాలను వెతకడానికి కూడా పోలీసులు ఏ మాత్రం సహాయం చేయలేదని మృతుల బంధువులే కాలువ కట్టవెంట వెళ్లి మృతదేహాలను 10 రోజులు తరువాత కనుగొన్నారన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న యరపతినేని శ్రీనివాసరావుకు కనీసం మానవత్వం కూడా లేదని దుయ్యబట్టారు. ఘటన జరిగి ఇప్పటికి సుమారుగా రెండు నెలలు కావస్తున్నా నేటికీ యరపతినేని వారి కుటుంబాలను పరామర్శించలేదన్నారు. బాధితులను మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు తీసుకువెళ్లి జరిగిన విషయాన్ని చెప్పామని.. ఆయన స్పందించి మన ప్రభుత్వం రాగానే సీబీసీఐడీ వేసి విచారణ చేపట్టి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారన్నారు. వైఎస్సార్ సీపీ వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. పిల్లల అభివృద్ధి కొరకు పొలాన్ని వారికి కేటాయించి వారికి తోడుగా ఉంటామన్నారు.
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి


