ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ 19న వినుకొండలో రైతు సంఘం జిల్లా మహాసభ
సత్తెనపల్లి: రైతు పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. సత్తెనపల్లి సీపీఐ కార్యాలయంలో శనివారం జరిగిన నియోజకవర్గ రైతు సంఘ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సభకు కె.కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ మొక్కజొన్న, కందులు, వరి, తదితర పంటల పండించే రైతులకు కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదన్నారు. హరిచంద్రపురం నుంచి నకరికల్లు వరకు కృష్ణా జలాలను తరలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా ఇంకా ఆ పథకం కార్యరూపం దాల్చలేదన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ కూడా మరమ్మతులు చేసి వాడుక లోకి తెస్తే వ్యవసాయ రంగంలో పల్నాడు ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులు విక్రయించడంలో రైతులకు దళారుల ప్రమేయం అధికంగా ఉంటుందన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 19న వినుకొండలో జరిగే రైతు సంఘం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఆల్ ఇండియా కిసాన్ సభ జరిగి 90 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మరింత ఉత్సాహంగా జిల్లా మహాసభలు నిర్వహించుకునేందుకు సత్తెనపల్లి ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో రైతాంగం మహాసభలలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహాసభలలో రైతు సంఘం సత్తెనపల్లి నియోజకవర్గం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.


