ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

Apr 10 2026 10:15 AM | Updated on Apr 10 2026 10:15 AM

ఫ్యాప్టో డిమాండ్‌ మూల్యాంకన కేంద్రం వద్ద నిరసన

నరసరావుపేట ఈస్ట్‌: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపులో భాగంగా గురువారం సాయంత్రం కేబీఆర్‌ కళాశాలలో నిర్వహిస్తున్న 10వ తరగతి మూల్యాంకన కేంద్రంలో ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఫ్యాప్టో చైర్మన్‌ ఎల్‌.వి.రామిరెడ్డి మాట్లాడుతూ తమ నిరసన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ కమిషన్‌ ఏర్పాటు చేసి చైర్మన్‌ను నియమించాలని, ఇప్పటికే మూడేళ్లు కాలం గడిచిందన్నారు. వెంటనే 30 శాతం మధ్యంతర భృతి చెల్లించాలని కోరారు. 11వ పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించటంతోపాటు రిటైర్డ్‌ ఉద్యోగుల గ్రాట్యూటీ, కమ్యూటీషన్‌, ఆర్జిత సెలవులు బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పచెప్పరాదని కోరారు. అనంతరం ఫ్యాప్టో సెక్రెటరీ జనరల్‌ బి.సంపత్‌బాబు మాట్లాడుతూ ప్రస్తుత సీపీఎస్‌ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఆర్థిక కార్యదర్శి ఆర్‌.గోవిందరాజులు మాట్లాడుతూ, ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ సమస్యలను పరిష్కరించి విద్యాశాఖలో ఉన్న అసంబద్ధతను తొలగించాలని డిమాండ్‌ చేశారు. 72, 73, 74 జీఓలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు ఎం.మోహనరావు, బి.శ్రీనివాసరావు, టి.చంద్రయ్య, కె.వీరాంజనేయులు, షేక్‌మొహిద్దీన్‌ బాషా, బి.స్వర్ణరాజు, వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement