చావులో ఒక్కటయ్యారు.. | - | Sakshi
Sakshi News home page

చావులో ఒక్కటయ్యారు..

Apr 10 2026 10:15 AM | Updated on Apr 10 2026 10:15 AM

కొండవీడు కోటలో ప్రేమికుల ఆత్మహత్యాయత్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి

యడ్లపాడు: కొండవీడు కోట సాక్షిగా ఒక ప్రేమ కథ విషాదాంతమైంది. ప్రేమకు పెద్దలు నిరాకరించడంతోపాటు యువతికి వేరే వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేసినా తమ ప్రేమను మరిచిపోలేక ఆ జంట మృత్యువు ఒడికి చేరుకుంది. పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమికులు... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

పోలీసుల తెలిపిన వివరాల మేరకు... గుంటూరు స్వర్ణభారతినగర్‌కు చెందిన రసిక మణికంఠరాజు (20), కలెక్టరేట్‌ సమీపంలోని అంకమ్మనగర్‌కు చెందిన యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన మణికంఠరాజు తల్లిదండ్రులు యువతి ఇంటికి వెళ్లి పెళ్లి ప్రస్తావన తెచ్చారు. అందుకు యువతి కుటుంబ సభ్యులు నిరాకరించారు. వెంటనే తమ కుమార్తెకు సుమారు 20 రోజుల కిందట వేరొక యువకుడితో వివాహం జరిపించారు. అయినప్పటికీ తన ప్రియుడు మణికంఠ రాజును మరువలేని ఆ యువతి, భర్తతో కలిసి ఉండలేనని చెప్పి గుంటూరుకు తిరిగి వచ్చేసింది. ఈ నెల 7వ తేదీన ప్రేమికులిద్దరూ కొండవీడు కోటకు చేరుకున్నారు. అక్కడ తమ వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. వారిని గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు.

మృత్యువుతో పోరాడి...

జీజీహెచ్‌లో చావుబతుకుల మధ్య పోరాడుతూ మణికంఠ రాజు బుధవారం రాత్రి చనిపోగా, యువతి కూడా గురువారం మృతి చెందింది. మణికంఠరాజు తల్లి నళిని, యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యడ్లపాడు ఎస్‌ఐ టి. శివరామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మణికంఠ రాజు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవగా, యువతి మృతదేహానికి శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.

Advertisement
 
Advertisement
Advertisement