ట్యాబ్‌ ఆధారిత మూల్యాంకనం రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ట్యాబ్‌ ఆధారిత మూల్యాంకనం రద్దు చేయాలి

Apr 10 2026 10:09 AM | Updated on Apr 10 2026 10:09 AM

ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌

నరసరావుపేట ఈస్ట్‌: రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 10వ తరగతి మూల్యాంకనంలో విద్యాశాఖ నూతనంగా ప్రవేశపెట్టిన ట్యాబ్‌ ఆధారిత మూల్యాంకనాన్ని రద్దు చేసి పాత విధానాన్నే కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేశాయి. కేబీఆర్‌ కళాశాలలో నిర్వహిస్తున్న 10వ తరగతి మూల్యాంకన కేంద్రంలో ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించి జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావుకు వినతిపత్రం సమర్పించారు. ట్యాబ్‌ ఆధారిత కొత్త విధానం ఉపాధ్యాయులపై పెనుభారాన్ని మోపటంతోపాటు లోపభూయిష్టంగా మూల్యాంకన ప్రక్రియను దెబ్బతీస్తున్నదని తెలిపారు. ట్యాబ్‌లు సరిగా పనిచేయక పోవటం, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందుబాటులో లేకపోవటంతో సమాధాన పత్రాల స్కానింగ్‌ ప్రక్రియ ఆలస్యమవుతున్నదని తెలిపారు. రోజుకు 80 పేపర్లకు పైగా మూల్యాంకనం చేయాల్సి వస్తుండటంతో ఉపాధ్యాయులు మానసికంగా, శారీరకంగా అలసి పోతున్నారనీ, ఇది మూల్యాంకన నాణ్యతను ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఉదయం 9గంటలకు హాజరై రాత్రి 10 గంటల వరకు మూల్యాంకన పనులు చేయాల్సి వస్తున్నదని తెలిపారు. నిరంతరం ట్యాబ్‌ చూస్తుండటంతో కంటి నొప్పి, మసక చూపు వంటి కంటి సమస్యలతో పాటు మెడ, నడుంనొప్పి, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఉపాధ్యాయులు, ప్రధానంగా మహిళా ఉపాధ్యాయినిలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. ప్రభుత్వం వెంటనే వాస్తవ పరిస్థితులను గుర్తించి పాత మూల్యాంకన విధానాన్నే కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఎల్‌.వి.రామిరెడ్డి (ఎస్‌టీయూ), బి.సంపత్‌బాబు (ఏపీటిఎఫ్‌), ఆర్‌.గోవిందరాజులు (హెచ్‌ఎంఏ), ఎం.మోహనరావు (యూటీఎఫ్‌), షేక్‌.షరీఫ్‌ (ఏపీటీఎఫ్‌ 257) కె.వీరాంజనేయులు (ఎస్సీ, ఎస్టీ, యూఎస్‌), టి.చంద్రయ్య (ఎస్‌ఏఏపీ), షేక్‌.మొహిద్దీన్‌బాష (ఆర్‌యూటీఏ) పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement