నిరసనపై పోలీస్‌ ఓవరాక్షన్‌ | - | Sakshi
Sakshi News home page

నిరసనపై పోలీస్‌ ఓవరాక్షన్‌

Apr 9 2026 7:35 AM | Updated on Apr 9 2026 7:35 AM

హోటళ్లు, దుకాణాలతో పాటు బ్యాంకును మూసివేయించిన పోలీసులు

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద భారీ బందోబస్తు

హోటళ్లు, దుకాణాలతో పాటు బ్యాంకును మూసివేయించిన పోలీసులు

వైఎస్సార్‌ సీపీ శాంతియుత నిరసన అడ్డగింత

పార్టీ శ్రేణులను లాఠీలతో పొడిచిన పోలీస్‌ సిబ్బంది

గుంటూరు ఎడ్యుకేషన్‌/లక్ష్మీపురం: మహిళలను కించపర్చే విధంగా జుగుస్సాకరమైన వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చెత్త పలుకుపై నిరసన తెలిపేందుకు వెళ్లిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, కార్యకర్తలపై పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. శాంతియుతంగా చేస్తున్న నిరసనను భగ్నం చేసేందుకు కూటమి నాయకుల ఆదేశాల మేరకు పోలీసులు రెచ్చిపోయారు. బ్రాడీపేట 4వ లైనులోని ప్రైవేటు కాంప్లెక్స్‌ రెండో అంతస్తులో బయటకు కనిపించని విధంగా ఉండే కార్యాలయానికి సీఎం క్యాంపు కార్యాలయం తరహాలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్డుకు అన్ని వైపులా బారికేడ్లు అడ్డుగా పెట్టారు.

రోడ్డుపై బైఠాయించి నిరసన...

బారికేడ్లను తోసుకుని వెళ్లిన జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుతో పాటు నగర అధ్యక్షురాలు షేక్‌ నూరిఫాతిమా, పార్టీ సమన్వయకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. శంకర్‌ విలాస్‌ సెంటర్‌ వద్దకు వైఎస్సార్‌ సీపీ జిల్లా నాయకులు, సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులతో కలిసి రావడంతో పోలీసులు బారికేడ్ల వద్ద నిలిపివేశారు. అయితే జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పోలీస్‌ అధికారులైన ఈస్ట్‌ డీఎస్పీ అజీజ్‌, వెస్ట్‌ డీఎస్పీ బెల్లం శ్రీనివాస్‌లతో మాట్లాడుతూ శాంతియుతంగా చేపట్టనున్న ఈ నిరసనకు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి బాధ్యత వహిస్తామని, అనుమతి కల్పించాలని, ఎలాంటి దాడులు విధ్వంసం జరుగకుండా చూసుకుంటామని డీఎస్పీ అజీజ్‌తో చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే తరుణంలో అరండల్‌పేట సీఐ ఆరోగ్యరాజు మధ్యలో కలుగ జేసుకోని మాజీ మంత్రి అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు దురుసుగా మాట్లాడారు. తాను డీఎస్పీతో మాట్లాడుతుంటే మధ్యలో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం సమంజసం కాదని చెబుతుండగా సీఐ వాగ్వాదానికి దిగారు.

లాఠీలకు పనిచెప్పిన పోలీస్‌ సిబ్బంది..

ఒక పక్క పోలీస్‌ ఉన్నతాధికారులతో మాట్లాడుతుండగానే సీఐ తీరుపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయగా ఒక్కసారిగా పోలీసులకు పార్టీ శ్రేణుల మధ్య తొపులాట చోటుచేసుకుంది. ఒక కానిస్టేబుల్‌ లాఠీతో కార్యకర్తలను పొడిచి గాయపరిచారు. దీంతో ఒక్కసారిగా పార్టీ శ్రేణులు బారిగేట్లను నెట్టుకుని శంకర్‌ విలాస్‌ సమీపంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్దకు చేరుకుని బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కార్యకర్తలపై లాఠీచార్జీ చేస్తున్న పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసిన పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ కుడిచేతికి గాయమైంది.

వైఎస్సార్‌ సీపీ శాంతియుత నిరసన తెలిపేందుకు వస్తున్న సమయంలో బ్రాడీపేట 4వ లైనులోని శంకర్‌ విలాస్‌ హోటల్‌తో పాటు దుకాణాలు, బ్యాంకును పోలీసులు మూసివేయించారు. 4వ లైను మొదటి అడ్డరోడ్డు మొత్తాన్ని స్వాధీనంలోకి తీసుకున్న పోలీసు యంత్రాగం ఇద్దరు డీఎస్పీల పర్యవేక్షణలో సీఐలు, ఎస్‌ఐలు, పెద్ద సంఖ్యలో కానిస్టేబుళ్లు, పోలీసు వ్యానును తీసుకువచ్చారు. కర్ఫ్యూ వాతావరనాన్ని తలపింపజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement