ఏఎన్‌యూ(పెదకాకాని): యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగి మరికొందరికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నది సీఎం నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చే యువతకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోందన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బుధవారం ఈడబ్ల్యూఎస్ వర్గాలకు వ్యాపార, పారిశ్రామిక అవకాశాలపై నిర్వహించిన ఒకరోజు అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ఎంఎస్‌ఎంఈ పార్కులు కీలకమని చెప్పారు.
ఈడబ్ల్యూఎస్ వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి, వారిని పారిశ్రామిక రంగంలోకి తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇప్పటికే ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించగా, ప్రస్తుతం ఉపాధి, సృష్టిపై దృష్టి పెట్టామన్నారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామని, కేవలం 22 నెలల్లోనే రూ.25 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, పెట్టుబడిదారులకు త్వరితగతిన అనుమతులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. ఈ పార్కుల్లో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చే ఈడబ్ల్యూఎస్ యువతకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా అండగా ఉంటామని తెలిపారు. ఆసక్తి ఉన్న యువత డీపీఆర్‌లతో ముందుకొస్తే సబ్సిడీ రుణాలు, శిక్షణ, ఉత్పత్తి నిర్వహణపై మార్గదర్శకత్వం అందిస్తామని చెప్పారు. ఈడబ్ల్యూఎస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. సునీత మాట్లాడుతూ యువత కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలకే పరిమితం కాకుండా, తామే వ్యాపారాలు ప్రారంభించి ఉద్యోగ దాతలుగా మారాలని సూచించారు. ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్ సీఈవో విశ్వమనోహరన్ మాట్లాడుతూ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ముందుకొచ్చే వారికి వివిధ రకాల సహాయం అందిస్తున్నామని, పారిశ్రామికీకరణతోనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ ఆచార్య కె గంగాధరరావు, రెక్టార్ ప్రొఫెసర్ రామినేని శివరాంప్రసాద్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సింహాచలం, కార్పొరేషన్ చైర్మన్‌లు బ్రహ్మంచౌదరి, బుచ్చిరామ ప్రసాద్, అధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


