దాచేపల్లి: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం చెందారు. దాచేపల్లి లోని దావత్ రెస్టారెంట్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సబావత్ వెంకట్ నాయక్ (41) మృతి చెందారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. మాచర్ల మండలం అచ్చమ్మకుంటకు చెందిన వెంకట నాయక్ 2004లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత 2012లో సివిల్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ పొంది ప్రస్తుతం వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. వెంకట్ నాయక్‌కు భార్య స్వరూప బాయి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం మీరు దాచేపల్లిలో నివాసం ఉంటున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తన వ్యక్తిగత పని నిమిత్తం ద్విచక్ర వాహనం(బుల్లెట్ ) పై వెంకట్ నాయక్ వెళ్లి తిరిగి దాచేపల్లి వస్తున్నాడు. ఈ క్రమంలో దాచేపల్లిలోని దావత్ రెస్టారెంట్ వద్ద ఓ లారీ ఆకస్మికంగా యూటర్న్ తీసుకుంటుంది. దీంతో హైవే పై వస్తున్న వెంకట్ నాయక్ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ద్విచక్ర వాహనం లారీ కిందకు దూసుకుపోయింది. ఈ ఘటనలో వెంకట్ నాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్ర వాహనంపై ఉన్న శివ అనే వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వెంకట నాయక్‌ని హుటాహుటిన దాచేపల్లిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం పిడుగురాళ్ల తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ పాపారావు పరిశీలన చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కానిస్టేబుల్ వెంకట్ నాయక్ మృతదేహాన్ని నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య, ఎంపీపీ కందులు జాను, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి షేక్ జాకీర్ హుస్సేన్, నాయకులు మునగా శ్రీనివాసరావు, కొమ్ము బుజ్జి తదితరులు సందర్శించి నివాళులర్పించారు.


