తాడికొండ: తాడికొండ దుర్గా వైన్స్‌లో జరిగిన యువకుడి హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తాడికొండ సీఐ కె వాసు వెల్లడించారు. బుధవారం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 05వ తేదీన తాడికొండ దుర్గా వైన్స్‌లో నూతక్కి మరియదాసు, నూతక్కి నరేష్‌ల మధ్య వివాదం జరిగింది. ఈ వివాదంలో మృతుడు మరియదాసు, నరేష్ తల పగలగొట్టాడు. బయటకు వెళ్లిన నరేష్ తన సోదరుల వరసయ్యే కటారి జాషువా అలియాస్ కిరణ్, గాజులవర్తి సాంబశివరావు, నూతక్కి సాంబశివరావులను వెంట తెచ్చుకొని రోడ్డుపై నిలబడి వైన్స్‌లోకి పంపించాడు. అక్కడ వివాదం ముదరడంతో మరియదాసును బ్రిక్స్ రాయితో తల పగలగొట్టి విచక్షణా రహితంగా కొట్టడంతో మరియదాసు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. విచారణలో భాగంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా బుధవారం ఉదయం నిందితులను తాడికొండ అడ్డరోడ్డు వద్ద సంచరిస్తుండగా అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వాసు తెలిపారు. నిందితుల్లో ఒకరైన నూతక్కి సాంబశివరావు తాడికొండలో వీఆర్‌ఏగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళగిరి అడిషనల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్, జూనియర్ డివిజన్ న్యాయమూర్తి వీరికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు.


